న్యూఢిల్లీ, అక్టోబర్ 3: భారత్‌లో ఏటా 51లక్షల మంది చికున్‌గున్యా బారిన పడుతున్నారని బ్రిటిష్ మెడికల్ జర్నల్ తెలిపింది. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ పరిశోధకుల అధ్యయనం వివరాలను ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న చికున్‌గున్యా కేసులలో భారత్, బ్రెజిల్‌లోనే 48 శాతం మంది బాధితులు ఉంటున్నారని పేర్కొంది.
చికున్‌గున్యా సోకిన వారిలో సుమారు 50 శాతం మంది దీర్ఘకాలిక ఆరోగ్యం పైనా ప్రభావం చూపుతున్నట్టు తెలిపింది. 50 శాతం మంది బాధితులు దీర్ఘకాలిక వైకల్యానికి గురవుతున్నట్టు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 1.4 కోట్ల మంది చికున్‌గున్యా బారినపడే ప్రమాదంలో ఉన్నారని అధ్యయనం పేర్కొంది. ప్రజారోగ్య సంస్థలు, అధికారులు తగిన చర్యలు తీసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టాల్సిన అవసరముందని సూచించింది.