న్యూఢిల్లీ: మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఎన్ ఆనంద్ వెంకటేశ్(Justice Anand Venkatesh)ను సుప్రీంకోర్టు ప్రశంసించింది. తమిళనాడు మంత్రి కే పొన్నమడిపై ఉన్న అవినీతి కేసును సుమోటో ద్వారా జస్టిస్ వెంకటేశ్ మళ్లీ రీఓపెన్ చేశారు. అయితే ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలంటూ కోరుతూ పొన్నమడి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ సీజేఐ చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం ఆ పిల్‌ను పరిశీలించింది. ఈ నేపథ్యంలో సీజేఐ చంద్రచూడ్ స్పందిస్తూ.. థ్యాంక్ గాడ్.. జస్టిస్ వెంకటేశ్ లాంటి వారు జడ్జిలుగా ఉండడం గర్వకారణమని, మన వ్యవస్థలో ఇలాంటి న్యాయమూర్తులు అవసరమని, ఈ కేసులో విచారణను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేశారని, కానీ వెంకటేశ్ లాంటి జడ్జి ఉండడం వల్ల ఆ కేసు మళ్లీ రీఓపెన్ అయ్యిందని అన్నారు.
అక్రమ ఆస్తులు కలిగి ఉన్న కేసులో మంత్రి పొన్నమడిని దోషిగా తేల్చారు. అయితే ఆ కేసును ఈ ఏడాది ఆగస్టులో జస్టిస్ వెంకటేశ్ రీఓపెన్ చేశారు. పొన్నమడితో పాటు ఇద్దరు డీఎంకే మంత్రులపై ఉన్న పాత కేసుల్ని ఆ జడ్జి రీఓపెన్ చేశారు. ఈ నేపథ్యంలో పొన్నముడితో పాటు ఆయన భార్య.. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ కేసులో ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఆ పిటీషన్‌ను విచారించేందుకు సీజేఐ చంద్రచూడ్ వ్యతిరేకించారు.
మద్రాసు హైకోర్టులోని సింగిల్ బెంచ్ వద్ద ఆ కేసు పెండింగ్‌లో ఉందని, ఈ కేసులో వాదనలను ఆ కోర్టు ముందే వినిపించాలని సీజేఐ ఇవాళ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. మంత్రి పొన్నమడి, ఆయన భార్య విశాలాక్షిపై 2002లో అవినీతి కేసు నమోదు అయ్యింది. ఆ జంటకు ఈ ఏడాది జూన్‌లో ఆ కేసు నుంచి విముక్తి లభించింది. జూన్ 28వ తేదీన ఆ కేసులో ఇద్దరూ నిర్దోషులుగా తేలారు. కానీ ఆగస్టు 10వ తేదీన ఆ కేసును మళ్లీ విచారణ చేపట్టేందుకు మద్రాసు హైకోర్టు సిద్దమైంది.