Madhya Pradesh Elections | భోపాల్, నవంబర్ 15: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో బుధవారం సాయంత్రంతో ప్రచారం పర్వం ముగిసింది. 230 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతగా శుక్రవారం పోలింగ్ జరుగనున్నది. 230 స్థానాల్లో 2,533 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. దాదాపు 5.6 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొన్నది. ఆయా పార్టీలు కీలక నేతలను రంగంలోకి దింపి ప్రచారంతో హోరెత్తించాయి.
బీజేపీ తరపున ప్రధాని మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్‌షా, ఇతర కేంద్ర మంత్రులు, పలు రాష్ర్టాల సీఎంలు, తదితర నేతలు ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతిలో మునిగిపోయాయని, ప్రజాధనాన్ని లూఠీ చేశాయని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే విద్యుత్తు కోతలు, నీటి సంక్షోభం, మౌలిక సదుపాయాల లేమి వంటి పరిస్థితులు తలెత్తుతాయని ప్రచారం చేశారు. కాంగ్రెస్ నుంచి ప్రచారం చేపట్టిన ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇతర సీనియర్ నేతలు కుల గణన, ఓబీసీ సంక్షేమం వంటి హామీలను ప్రధానంగా ప్రస్తావించారు.
వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు..
ప్రభుత్వం, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత, అవీనీతి ఆరోపణలు వెరసి ఓటమి భయంతో బీజేపీ ఈ సారి పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలను బరిలోకి దింపింది. శివరాజ్ సింగ్ చౌహాన్‌పై వ్యతిరేకత నేపథ్యంలో ఆయన్ను సీఎం అభ్యర్థిగా బీజేపీ ఫోకస్ చేసినట్టుగా కనిపించలేదు. కమలం పార్టీ ప్రధానంగా మోదీ చరిష్మానే నమ్ముకొన్నది. కాగా, రాష్ట్రంలో బీజేపీ ’50 శాతం కమీషన్’ సర్కార్‌ను నడుపుతున్నదని, ధరలు పెచ్చరిల్లిపోయాయని, నిరుద్యోగం పెరిగిందని ప్రతిపక్ష కాంగ్రెస్ విస్తృంగా ప్రచారం చేసింది. గత 18 ఏండ్ల బీజేపీ పాలనలో 250కి పైగా మేజర్ స్కామ్‌లు జరిగాయని ఆరోపిస్తూ ఇటీవల ఒక లిస్టు కూడా విడుదల చేసింది. మరోవైపు బీజేపీలో నేతల మధ్య విభేదాలు కలవరపరుస్తున్నాయి. పార్టీ అధిష్ఠానం, రాష్ట్ర నేతల తీరుపై మాజీ సీఎం ఉమాభారతి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
విపక్ష కూటమిలో ఎవరికి వారే!
కాంగ్రెస్ పరిస్థితి మరో విధంగా ఉన్నది. పార్టీలో నేతలు దిగ్విజయ్, కమల్‌నాథ్ మధ్య విభేదాలు ఉన్నాయి. ఇండియా కూటమిలోమిత్రపక్షాలుగా ఉన్న ఎస్పీ, ఆప్, జేడీయూ వంటి పార్టీలు విడిగా పోటీచేస్తున్నాయి.