Anand Yadav | రాయ్‌పూర్ : సంతానం కోసం మంత్రగాడి మాట విన్న ఓ వ్యక్తి బతికున్న కోడిపిల్లను మింగి ప్రాణాలు కోల్పోయాడు. భూమి మీద నూకలు మిగిలే ఉన్న ఆ కోడిపిల్ల మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఛత్తీస్‌గఢ్‌లోని ఛిండ్కా గ్రామంలో ఈ వింత ఘటన జరిగింది. ఆనంద్ యాదవ్(35) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో స్పృహ కోల్పోయి పడిపోవడంతో గ్రామస్థులు అంబికాపూర్‌లో మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించాడని గుర్తించి పోస్టుమార్టం చేశారు. గొంతు వద్ద కోయగా ప్రాణంతో ఉన్న కోడిపిల్ల ఇరుక్కోని ఉందని వైద్యులు గుర్తించి బయటకు తీశారు. 20 సెంటీమీటర్ల పొడవున్న ఈ కోడిపిల్ల ఆనంద్ గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరి అందక మరణించాడని వైద్యులు తేల్చారు. తన కెరీర్లో 15 వేల పోస్టుమార్టంలు చేశానని, ఇలాంటి కేసు మాత్రం ఎన్నడూ చూడలేదని వైద్యుడు సంతుబాగ్ పేర్కొన్నారు. కాగా, సంతానం కోసం ప్రయత్నిస్తున్న ఆనంద్ ఓ మంత్రగాడి సూచనతోనే బతికున్న కోడిపిల్లను మింగాడని గ్రామస్థులు చెప్తున్నారు.