న్యూఢిల్లీ : చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బఘేల్ సోమవారం ఆరెస్సెస్‌పై విరుచుకుపడ్డారు. మహాత్మ గాంధీని పొట్టనపెట్టుకున్నది ఈ సంస్ధేనని మండిపడ్డారు. ఆరెస్సెస్ హిందుత్వ అసలు ఎక్కడి నుంచి వచ్చిందని నిలదీశారు. వారు (ఆరెస్సెస్) ఏ దేవుడు, దేవతను ఆరాధిస్తారు, అనుసరిస్తారని ప్రశ్నించారు.
ఈ సంస్ధలు పుట్టుకొచ్చి కనీసం వందేండ్లు కూడా కాలేదని ఆరెస్సెస్, వీహెచ్‌పీలు 1925లో ఏర్పాటయ్యాయని, అంతకుముందు హిందువులు లేరా అని ప్రశ్నించారు. బీజేపీ సైద్ధాంతిక సంస్ధ ఆరెస్సెస్‌పై విమర్శలు గుప్పిస్తూ హింస, గూండాగిరీ మన సంస్కృతి కాదని అన్నారు.
వీరు మనుషులను జంతువుల కంటే హీనంగా చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ విద్వేషంతో ప్రజలతో మమేకం కావాలని కోరుకుంటోందని ఆరెస్సెస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి మన్మోహన్ వైద్య ఆరోపించారు. కాగా, గతంలో ఆరెస్సెస్ యూనిఫాం ఖాకీ నిక్కర్లు దగ్ధమవుతున్న ఫోటోను అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో షేర్ చేయడంతో ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్ ముదిరింది.