న్యూఢిల్లీ : ఇష్టమైన సంగీతం వినేవారి మనసు ఉల్లాసంగా ఉంటుంది. అయితే, మధుమేహం వంటి శారీరక సమస్యలపై సంగీతం సానుకూల ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. మధుమేహ రోగుల బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తగ్గించడంలో మ్యూజిక్ థెరపీ ఉపయోగపడుతుందని తెలిపారు. సంగీతం మన శరీరంలోని ఎండోక్రైన్ సిస్టమ్ (వాహికలు లేకుండానే రక్తంలోకి తమ రసాలను విడుదల చేసే గ్రంథుల వ్యవస్థ)ను చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రభావితం చేస్తుంది.
సంగీతం వినడం వల్ల, మరీ ముఖ్యంగా మనం ఆనందించే బాణీలను వినడం వల్ల, రకరకాల హార్మోన్లను విడుదల చేసే విధంగా మెదడుకు ప్రోత్సాహం లభిస్తుంది. ఉదాహరణకు, డోపమైన్ విడుదలైతే, మన మానసిక స్థితి మెరుగుపడుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. అంతేకాకుండా, సంగీతం వల్ల స్ట్రెస్ హార్మోన్లు తగ్గుతాయి. దీనివల్ల సమగ్ర ఆరోగ్యానికి ప్రయోజనం కలుగుతుంది. సంగీతం వినడం వల్ల సహజసిద్ధ నొప్పి నివారిణులు, మానసిక స్థితిని పెంచే ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి.
ఇన్సులిన్ విషయంలో మ్యూజిక్ థెరపీ కొన్ని మంచి ఫలితాలను చూపించినప్పటికీ, ఈ దశలో అందరికీ ఈ ఫలితాలను వర్తింపజేయడం సరైనది కాదు. భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు జరిగితే, మధుమేహ నియంత్రణలో మ్యూజిక్ థెరపీ కూడా భాగమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.