Prahlad Joshi | బెంగళూరు, అక్టోబర్ 18: కర్ణాటకలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముడా కుంభకోణంలో పీకల్లోతు కూరుకుపోగా, విపక్ష బీజేపీ కూడా తామేమీ తక్కువ తినలేదని నిరూపించుకుంటున్నది. కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి కుటుంబ సభ్యులపై మోసం, కుల దూషణ, బెదిరింపు ఆరోపణలపై గురువారం కేసు నమోదైంది.
లోక్సభ ఎన్నికల్లో తనకు బీజేపీ టికెట్ ఇప్పిస్తానంటూ మంత్రి ప్రహ్లాద్ జోషీ సోదరుడు గోపాల్, సోదరి విజయలక్ష్మీ జోషి, మేనల్లుడు అజయ్ జోషి తన నుంచి రూ.2.5 కోట్ల తీసుకున్నారంటూ మాజీ ఎమ్మెల్యే దేవానంద్ చవాన్, అతని భార్య సునీత చవాన్ ఫిర్యాదు చేశారు. ఆ డబ్బును అమిత్ షా కార్యదర్శికి అందజేయాల్సి ఉందని గోపాల్ తనతో చెప్పారని బాధితురాలు తెలిపింది. ప్రహ్లాద్ జోషీకి కేంద్రంలో మంచి పలుకుబడి ఉందని, ప్రధాని మోదీ, అమిత్ షా అతని మాట వింటారని నమ్మించాడన్నారు. తర్వాత టికెట్ రాకపోవడంతో తమ డబ్బు గురించి అడగ్గా తమను దూషించి బెదిరించినట్టు చెప్పారు.