ముంబై : అమరావతి ఎంపీ నవనీత్ రవిరాణా దంపతుల కేసులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే, ఈ కేసులో ఈ నెల 16న విచారణ జరుగనున్నది. ఇద్దరు నేతలు ఇవాళ బోరువాలి కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇచ్చింది. ఐపీసీ సెక్షన్ 353 కింద నమోదైన కేసులో నవనీత్ రాణా దంపతులపై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. శివసేన పార్టీ అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన మాతోశ్రీ ఎదుట హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని నవనీత్ దంపతులు ప్రకటించారు. ఆ తర్వాత దంపతులిద్దరిని ఏప్రిల్ 23న పోలీసులు అరెస్టు చేశారు.
ఆ తర్వాత దేశ ద్రోహంతో పాటు మరో రెండు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, మే 4న వారికి కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. అదే నెల 5న విడుదలైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. అరెస్టు సమయంలో పోలీసులు వేధింపులకు పాల్పడ్డారని ఎంపీ నవనీత్ రాణా లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని ఆయన ప్రివిలేజెస్ కమిటీకి అప్పగించారు. ఈ మేరకు కమిటీ మహారాష్ట్ర ఉన్నతాధికారులను ఈ నెల 15న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ముంబై పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ ఎంపీ సునీల్ సింగ్
నేతృత్వంలోని కమిటీ ఫిర్యాదుపై విచారణ జరుపనున్నది.