Chardham Yatra | ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో చార్ధామ్ యాత్రను 24గంటలు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గత కొద్దిరోజులుగా ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. ఉత్తరకాశీలో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షానికి అనేక చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. డెహ్రాడూన్ వాతావరణ కేంద్రం జారీ చేసిన భారీ వర్ష హెచ్చరికల నేపథ్యంలో గర్హ్వాల్ కమిషనర్ సూచనల మేరకు చార్ధామ్ యాత్రను రాబోయే 24 గంటలు నిలిపివేసినట్లు జిల్లా మేజిస్ట్రేట్ ప్రశాంత్ కుమార్ ఆర్య తెలిపారు. జిల్లాలోని యాత్రికులను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని పోలీసులకు, ఎస్డీఎంకు సూచించారు.
డెహ్రాడూన్ వాతావరణ శాఖ జారీ చేసిన బులెటిన్ ప్రకారం.. డెహ్రాడూన్, తెహ్రీ, పౌరి, హరిద్వార్, చంపావత్, నైనిటాల్, ఉధమ్ సింగ్ నగర్‌లోని కొన్ని ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేసింది. హిమాలయ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నది. డెహ్రాడూన్, తెహ్రీ, పౌరి, హరిద్వార్, నైనిటాల్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. ఈ క్రమంలో చాలా ప్రాంతాలకు వాతావరణశాఖ రెడ్ అలెర్ట్‌ని జారీ చేసింది. రాష్ట్రంలోని బాగేశ్వర్ జిల్లాలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా.. ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షం మరియు మెరుపులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరకాశి జిల్లాలోని బార్కోట్-యమునోత్రి రహదారిపై సిలాయ్ బాంద్ క్లౌడ్ బరస్ట్ కారణంగా కుంభవృష్టి కురిసింది.
ఇప్పటి వరకు తొమ్మిది రోడ్డు నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు. వరద నేపథ్యంలు యమునోత్రి జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఎన్‌హెచ్ బార్కోట్ వద్ద అధికారులను అప్రమత్తం చేశారు. అయితే, కేదార్నాథ్ యాత్రలో కీలకమైన మార్గమైన రుద్రప్రయాగ్‌లోని సోన్‌ప్రయాగ్-ముంకటియా రహదారి కొండచరియలు విరిగిపడడం కారణంగా మూసివేశారు. భద్రత దృష్ట్యా సోన్‌ప్రయాగ్, గౌరికుండ్ వద్ద యాత్రికుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. చమోలి, పౌరి, డెహ్రాడూన్, రుద్రప్రయాగ్, ఇతర జిల్లాలతో సహా అనేక జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నదులు ప్రమాదకరంగా ఒడ్డున ఉప్పొంగుతుండగా.. నది ఒడ్డున నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పరిపాలన తాజా హెచ్చరిక జారీ చేసింది.