లక్నో: బీజేపీ ఎంపీ విందుపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) మండిపడ్డారు. అక్కడ జరిగిన ‘మటన్ వార్’ చరిత్రకెక్కిందని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ మిర్జాపూర్‌లోని తన కార్యాలయంలో బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ బింద్ పార్టీ నేతలు, కార్యకర్తలకు శనివారం విందు ఇచ్చారు. అయితే మటన్ గ్రేవీలో మాంసం ముక్కలు లేవని బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆరోపించారు. వడ్డించే వ్యక్తిని కొందరు కొట్టారు. దీంతో ఆ విందులో గందరగోళం చెలరేగింది. బీజేపీ సీనియర్ సభ్యులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
కాగా, సోమవారం మజ్వాన్లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన మండిపడ్డారు. ‘మీ నియోజకవర్గంలో జరిగిన కొన్ని సంఘటనలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇక్కడ ‘మటన్ వార్’ కూడా జరిగిందని నాకు తెలియదు. వివిధ రకాల యుద్ధాలను చూశాం. ఈ మటన్ వార్ కూడా చరిత్రలో నమోదైంది’ అని అన్నారు.
మరోవైపు మీర్జాపూర్ జిల్లాలోని మజ్వాన్ నియోజకవర్గంలో నిషాద్ పార్టీ ఎమ్మెల్యే అయిన వినోద్ కుమార్ బింద్, బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసి ఎంపీగా గెలిచారు. దీంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని సుచిస్మిత మౌర్యపై, భదోహి ఎంపీ రమేశ్ బింద్ కుమార్తె జ్యోతి బింద్‌ను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) బరిలోకి దింపింది.