రాంచీ: ఛత్ పూజా కార్యక్రమం సందర్భంగా రెండు రాజకీయ గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో టెంట్లు కూల్చి వేయడంతోపాటు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. సిద్ధగోరాలోని సూర్య మందిరం వద్ద ఛత్ వేడుకల కోసం స్వతంత్ర ఎమ్మెల్యే సరయూ రాయ్, బీజేపీ నేత, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ మద్దతుదారులు పోటీ పడ్డారు. శుక్రవారం రాత్రి దాస్ వర్గం నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల వేదిక సమీపంలో ఎమ్మెల్యే రాయ్ వర్గానికి చెందిన వారు భక్తుల కోసం టెంట్, కుర్చీలు ఏర్పాటు చేశారు.
అయితే బీజేపీ నేత దాస్ మద్దతుదారులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయ్ వర్గం ఏర్పాటు చేసిన టెంట్లను కూల్చి, కుర్చీలు విరగ్గొట్టారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. విరిగిన కుర్చీలతో కొట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీని వీడిన సరయూ రాయ్, జంషెడ్పూర్ ఈస్ట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. బీజేపీ మాజీ సీఎం రఘుబర్ దాస్‌ను ఎన్నికల్లో ఓడించారు.
Video: Chairs Fly, Tents Uprooted As 2 Groups Clash At Chhath Puja Event https://t.co/KfmzXHbmtQ pic.twitter.com/Ohv5osHAta
— NDTV (@ndtv) October 29, 2022