Cabs Rates | ఉబర్ (Uber), ఓలా (Ola) వంటి యాప్‌లు ఒకే దూరానికి ఆండ్రాయిడ్‌లో ఒక ఛార్జీని, ఆపిల్ ప్లాట్ఫామ్లో వేరొక ఛార్జీని (Cabs Rates) వసూలు చేస్తుండటంపై ఇటీవలే పెద్ద ఎత్తున చర్చ నడిచిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. ఈ మేరకు పూర్తి వివరణ ఇవ్వాలని కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ (Ministry of Consumer Affairs) ఉబర్, ఓలా సంస్థలకు నోటీసులు జారీ చేసింది.
ఒకే సర్వీసుకు రెండు సంస్థలూ వేర్వేరు ఛార్జీలు వసూలు చేస్తుండటంపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ సీసీపీఏ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో తాజాగా చర్యలకు ఉపక్రమించింది. ఛార్జెస్ వసూలు, అందుకు అనుసరిస్తున్న పద్ధతుల గురించి వివరాలు ఇవ్వాలని నోటీసుల్లో కోరింది. వివక్షతకు సంబంధించి ఆందోళనల్ని పరిస్కరించాలని స్పష్టం చేసింది. ఈ పద్ధతిని స్పష్టంగా ధరలను ఉల్లంఘించడమే అని వ్యాఖ్యానించింది. ఛార్జీల వసూలులో పారదర్శకత, న్యాయాన్ని నిర్ధారించడానికి వివరణాత్మక ప్రతిస్పందన కోరింది.
ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి క్యాబ్ బుక్ చేసిన వారితో పోలిస్తే ఐఫోన్ నుంచి బుక్ చేసిన వారికి ఎక్కువ ఛార్జీ పడుతుందా? ఐఫోన్ వినియోగదారులను ధనికులుగా చూస్తూ కంపెనీలు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నాయా? చాలాకాలంగా వినియోగదారుల్లో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలుమార్లు సోషల్ మీడియా వేదికగా కొందరు ఇది నిజమేనని నిరూపించి, క్యాబ్ సర్వీసుల కంపెనీల తీరును ఎండగట్టారు. ఇటీవలే ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి, ఈ ధరల్ని వేర్వేరు మొబైళ్లలో పోలుస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అంతేకాదు ఇటీవలే టైమ్స్ ఆఫ్ ఇండియా చేపట్టిన పరిశీలనలోనూ ఈ విషయం వెల్లడయ్యింది. చెన్నైలోని మూడు రూట్లలో ఈ సంస్థ ప్రతినిధులు ఆండ్రాయిడ్, ఐఫోన్ల నుంచి ఒకే సమయంలో క్యాబ్‌లు బుక్ చేశారు. మూడు రూట్లలోనూ ఆండ్రాయిడ్ నుంచి బుక్ చేసిన వారి కంటే ఐఫోన్ నుంచి బుక్ చేసిన వారికి ఎక్కువ ఛార్జీ పడింది. మదిపక్కం నుంచి వెలచెరి ఫియోనిక్స్ మాల్‌కు ఆండ్రాయిడ్ నుంచి క్యాబ్ బుక్ చేస్తే రూ.195 పడగా, ఐఫోన్ నుంచి బుక్ చేసిన వ్యక్తికి రూ.260 పడింది. టీనగర్ నుంచి ఎగ్మోర్కు ఆండ్రాయిడ్ యూజర్‌కు రూ.180 పడగా, ఐఫోన్ యూజర్‌కు రూ.344 పడింది. అవది నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు ఆండ్రాయిడ్‌లో రూ.961 పడగా, ఐఫోన్లో రూ.1,010 పడింది. ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read..
“Cabs Rates | ఐఫోన్ యూజర్లపై బాదుడు.. క్యాబ్ ధరల నిర్ణయంలో కంపెనీల గోల్మాల్?”
“Cab Fare | లో బ్యాటరీ ఉంటే చార్జీల మోతే.. క్యాబ్ అగ్రిగేటర్ల మాయాజాలం!”