Cabs Rates | చెన్నై, డిసెంబర్ 26: ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి క్యాబ్ బుక్ చేసిన వారితో పోలిస్తే ఐఫోన్ నుంచి బుక్ చేసిన వారికి ఎక్కువ ఛార్జీ పడుతుందా? ఐఫోన్ వినియోగదారులను ధనికులుగా చూస్తూ కంపెనీలు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నాయా? చాలాకాలంగా వినియోగదారుల్లో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలుమార్లు సోషల్ మీడియా వేదికగా కొందరు ఇది నిజమేనని నిరూపించి, క్యాబ్ సర్వీసుల కంపెనీల తీరును ఎండగట్టారు. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా పరిశీలనలోనూ ఈ విషయం వెల్లడయ్యింది.
చెన్నైలోని మూడు రూట్లలో ఈ సంస్థ ప్రతినిధులు ఆండ్రాయిడ్, ఐఫోన్ల నుంచి ఒకే సమయంలో క్యాబ్‌లు బుక్ చేశారు. మూడు రూట్లలోనూ ఆండ్రాయిడ్ నుంచి బుక్ చేసిన వారి కంటే ఐఫోన్ నుంచి బుక్ చేసిన వారికి ఎక్కువ ఛార్జీ పడింది. మదిపక్కం నుంచి వెలచెరి ఫియోనిక్స్ మాల్‌కు ఆండ్రాయిడ్ నుంచి క్యాబ్ బుక్ చేస్తే రూ.195 పడగా, ఐఫోన్ నుంచి బుక్ చేసిన వ్యక్తికి రూ.260 పడింది. టీనగర్ నుంచి ఎగ్మోర్కు ఆండ్రాయిడ్ యూజర్‌కు రూ.180 పడగా, ఐఫోన్ యూజర్‌కు రూ.344 పడింది. అవది నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు ఆండ్రాయిడ్‌లో రూ.961 పడగా, ఐఫోన్లో రూ.1,010 పడింది.
క్యాబ్ సర్వీసుల కంపెనీలు వినియోగించే ప్రైసింగ్ అల్గారిథంలు ఇలా భిన్నమైన ధరలు చూపిస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఏ ఫోన్ వాడుతున్నారనేది తెలుసుకోవడం, దానికి తగ్గట్టుగా ధరను మార్చడం చాలా చిన్న విషయమని ఫాస్ట్‌ట్రాక్ అనే సంస్థ ఎండీ సీ అంబిగణపతి తెలిపారు. ఏ డివైజ్ నుంచి బుక్ చేశారు, సదరు వినియోగదారు యాప్‌ను ఎన్నిసార్లు వాడుతున్నాడు వంటి విషయాలను క్యాబ్ అగ్రిగేటర్లు గుర్తిస్తాయని మరో నిపుణుడు పీ రవికుమార్ తెలిపారు. ఇందుకోసం ఆయా సంస్థలు గూగుల్ క్లౌడ్ ఏఐ, అజ్యూర్ ఎంఎల్ వంటి మెషీన్ లెర్నింగ్ సాంకేతికతలను వినియోగిస్తాయని చెప్పారు. ఫోన్‌ను బట్టి, వినియోగదారు ప్రవర్తనా తీరును బట్టి కూడా ధరలు మారుతాయని పలువురు నిపుణులు చెప్తున్నారు.
ఉబర్, ఓలా వంటి యాప్‌లు ఒకే దూరానికి ఆండ్రాయిడ్‌లో ఒక ఛార్జీని, ఆపిల్ ప్లాట్ఫామ్లో వేరొక ఛార్జీని వసూలు చేస్తుండటంపై దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ సీసీపీఏ దీనిపై దర్యాప్తు చేస్తుంది.