Cab Fare | న్యూఢిల్లీ, జనవరి 20: ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతి అవసరానికీ చాలా మంది ఆన్‌లైన్‌పైనే ఆధారపడుతున్నారు. ఆహార అవసరాల కోసం ఫుడ్ డెలివరీ యాప్‌లను, ప్రయాణాల కోసం రైడ్ హెయిలింగ్ సర్వీసులను ఆశ్రయిస్తున్నారు. కానీ, ఆ ప్లాట్‌ఫామ్‌లు అనుసరిస్తున్న ప్రైసింగ్ విధానంపై నిత్యం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటి చార్జీలు ఒక్కో ఫోన్లో ఒక్కో రకంగా ఉంటున్నాయని, వేర్వేరు ధరలతో తమను మోసగిస్తున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ క్యాబ్ సంస్థ ‘ఉబర్’ తన కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్న చార్జీల తీరుపై ఢిల్లీకి చెందిన రిషభ్ సింగ్ అనే ఆంత్రప్రెన్యూర్ ఓ ప్రయోగాన్ని నిర్వహించారు. అందుకోసం రెండు ఆండ్రాయిడ్ ఫోన్లు, మరో రెండు ఐఫోన్లను ఉపయోగించారు. వాటన్నింటిలో ఒకే ఉబర్ ఖాతాతో లాగిన్ అయ్యారు. తద్వారా ఒకే సమయంలో ఒకే విధమైన రైడ్లకు చార్జీలు ఎలా మారిపోతున్నాయో పరిశీలించారు.
ఈ ప్రయోగంలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ఫోన్లలో చార్జీలతోపాటు, డిస్కౌంట్లలోనూ తేడాలు కనిపించాయి. ఒక ఫోన్లో 13 శాతం, మరో ఫోన్లో 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు దర్శనమిచ్చింది. దీంతో వినియోగదారుల నుంచి ‘ఉబర్’ వసూలు చేస్తున్న చార్జీలు డివైజ్ ప్లాట్‌ఫామ్ (ఆపరేటింగ్ సిస్టమ్)ను బట్టి వేర్వేరుగా ఉంటున్నట్టు తేలింది.
ఒకే ఖాతా, ఒకే లొకేషన్, సమయం, షరతులు ఉన్నప్పటికీ ధరల్లో తేడాలు కనిపించాయని రిషభ్ సింగ్ వెల్లడించారు. అంతేకాకుండా డివైజ్‌లలోని బ్యాటరీ పర్సెంటేజీని బట్టి కూడా చార్జీల్లో తేడా కనిపిస్తున్నాయని, ఫోన్లో బ్యాటరీ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు ఆ క్యాబ్ సంస్థ ఎక్కువ చార్జీ వసూలు చేస్తున్నదని తెలిపారు. ఈ ప్రయోగంలో వెల్లడైన వివరాలను రిషభ్ సింగ్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. దీంతో ‘ఉబర్’తోపాటు ఇతర రైడ్ హెయిలింగ్ సర్వీసుల పారదర్శకతపై ఆన్లైన్లో కొత్త చర్చకు తెర లేచింది.