న్యూఢిల్లీ, మార్చి 23: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ఆధారంగా మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత స్వరూపం ప్రకారం లోక్సభ సీట్ల సంఖ్య 543 నుంచి 816కు పెరుగుతాయి. ఇందులో 273 సీట్లలో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తారు. కొత్త సెన్సస్, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తర్వాతే రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుందని ఈ చట్టం నిర్దేశిస్తున్నది.
అయితే ప్రభుత్వం మాత్రం ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే చట్టాన్ని సవరించి పార్లమెంట్ దిగువ సభలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు సజావుగా ఆమోదం పొందేందుకు ప్రతిపక్షాలను కూడా ప్రభుత్వం ప్రాథమికంగా సంప్రదించినట్లు తెలుస్తున్నది. క్యాబినెట్ ఆమోదం తర్వాత ముందుగా వచ్చే వారం రాజ్యసభలో సవరణ బిల్లును ప్రవేశపెట్లే అవకాశం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు.
2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ల బిల్లుతో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల లభిస్తుంది. నియోజకవర్గాల పునర్విభజన కాకపోవడంతో ఈ చట్టం అమల్లోకి రాలేదు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందుగానే ఈ చట్టాన్ని అమలు చేయాలంటే మరో రాజ్యాంగ సవరణ తప్పనిసరి. చట్టం ఏర్పడిన తర్వాత వచ్చే మొదటి జనాభా లెక్కల సేకరణ అనంతరం చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళలకు రిజర్వేషన్ను అమలుచేయాలని చట్టం నిర్దేశిస్తున్నది. నియోజకవర్గాల పునర్విభజనకు అతీతంగా ఇది అమలు చేయాలంటే ఈ చట్టంలోని సెక్షన్ 5ని ప్రభుత్వం సవరించాల్సి ఉంటుంది.
ఇది పార్లమెంట్ ఉభయ సభల్లో హాజరైన సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది ఆమోదంతోనే చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని రాజ్యాంగంలోని 368(2) అధికరణ నిర్దేశిస్తున్నది. లోక్సభలో 240 మంది ఎంపీలు, రాజ్యసభలో 103 మంది ఎంపీల బలం ఉన్న బీజేపీకి విపక్షాల మద్దతు లేకుండా ఈ సవరణను ఆమోదించడం సాధ్యపడదు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కోసం విధానాలు, రోడ్డుమ్యాప్ను చర్చించేందుకు అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గతవారం కోరారు.