న్యూఢిల్లీ, జూలై 11: ఆధార్ కార్డు పొందడం మరింత కఠినతరం కానుంది. భారతీయులకు మాత్రమే ఆధార్ నంబర్ లభించేలా ప్రభుత్వం నిబంధనలను మరింతం కఠినతరం చేస్తున్నది. పౌరసత్వానికి రుజువు కాకుండా కేవలం గుర్తింపు కార్డుగా ఉన్న ఆధార్ వ్యవస్థలో వయోజనుల పేర్ల నమోదు కఠినతరం కానున్నది. ఎవరైనా ఆధార్ నంబర్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న వారి వివరాలను (డాటాబేస్)ను పాస్‌పోర్టు, రేషన్‌కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, 10వ తరగతి సర్టిఫికెట్ల వంటి వాటిని పరిశీలించనున్నారు. ఈ ప్రక్రియను కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి విషయంలోనే కాకుండా, ఇప్పటికే కార్డులున్న వారు అందులో ఏదైనా మార్పులు చేయాలనుకుంటే వారికి కూడా వర్తింపజేయనున్నారు.ఆధార్‌ను కేవలం భారతీయ పౌరులకు మాత్రమే అందించడం కోసం ఈ మార్పులు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
వెరిఫికేషన్ బాధ్యత రాష్ర్టాలపై..
గత 15 ఏండ్లలో 140 కోట్లకు పైగా ఆధార్ నంబర్లను జారీచేశారు. అప్పుడే పుట్టిన శిశువులకు కూడా ఆధార్ నంబర్‌ను జారీ చేస్తున్న నేపథ్యంలో ఇకపై కొత్తగా పేర్లు నమోదు చేసుకొనే వయోజనుల విషయంలో నిబంధనలను కఠినతరం చేయనున్నారు. దేశంలోకి అక్రమంగా చొరబడిన వారు నకిలీ పత్రాల ఆధారంగా ఆధార్ కార్డులను పొందకుండా అరికట్టేందుకు గాను వెరిఫికేషన్ ప్రక్రియను కేంద్రం ఇకపై రాష్ర్టాలపై మోపనున్నది. రాష్ర్టాలకు చెందిన నిర్దేశిత పోర్టల్‌లో దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించిన తరువాతనే ఆధార్‌ను జారీచేయనున్నారు. ఈ మార్పుల వల్ల దేశంలోకి అక్రమంగా చొరబడిన వారు ఆధార్ కార్డును పొందడం సాధ్యం కాదని ఓ అధికారి అభిప్రాయపడ్డారు.