
న్యూఢిల్లీ : ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన కరోనా మరణాల కంటే అత్యధికంగా కొవిడ్-19 మరణాలు సంభవించాయని వెల్లడించిన పలు మీడియా కధనాలు అవాస్తవాలని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. కరోనా మరణాలను పకడ్బందీగా నమోదు చేసే పటిష్ట వ్యవస్ధ దేశంలో ఉందని స్పష్టం చేసింది. అధిక మరణాలను చూపేందుకు హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్), సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) డేటాను పోల్చిన నివేదికలను కేంద్రం తోసిపుచ్చింది.
కారణాలు తెలియని 2,50,000కు పైగా మరణాలను మీడియా కధనాలు కొవిడ్ మరణాలుగా పరిగణించాయని కేంద్రం ఆక్షేపించింది. ఎలాంటి ఆధారాలు లేని ఊహాజనిత మీడియా నివేదికలను వండివార్చారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కొవిడ్ డేటా నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, కరోనా సంబంధిత మరణాలను నమోదు చేసేందుకు సమర్ధ వ్యవస్థ ఇప్పటికే ఉందని స్పష్టం చేసింది. ఈ సిస్టంలో క్రమం తప్పకుండా కరోనా మరణాలను తాజాపరచాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం కోరిందని పేర్కొంది.