PM Modi | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువుల వాడకాన్ని తగ్గించుకోవాలంటూ ఆదివారం ప్రధాని మోదీ చేసిన సూచనలు.. అంతిమంగా దేశీయ విపణిలో వస్తూత్పత్తి ధరల పెరుగుదలకు కారణం కావొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశీ దిగుమతులను తగ్గించేలా కేంద్రం చర్యలకు ఉపక్రమించడమే దీనికి కారణంగా చెప్తున్నారు. ఇదే జరిగితే, మొత్తంగా సామాన్యుడి జేబుకు చిల్లుపడటం ఖాయమని హెచ్చరిస్తున్నారు.
భారత్ ఏటా విదేశాల నుంచి 700 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకొంటున్నది. దేశంలోని సామాన్యుడు తన దైనందిన జీవితంలో వాడుకొంటున్న 70 శాతం వస్తువులు విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్నవే. ఇందులో పెట్రోల్, వంటనూనె, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎరువులు, బంగారం ప్రధానమైనవి. వీటి చెల్లింపులను డాలర్లలోనే చేయాల్సి ఉండటంతో ఫారెక్స్ రిజర్వుల్లో క్షీణత కనిపిస్తున్నది. మోదీ ప్రభుత్వ హయాంలో రూపాయి విలువ రూ. 95 కంటే దిగువకు జారడంతో ఫారెక్స్ రిజర్వులు మరింతగా పడిపోతున్నాయి. ఈ క్రమంలోనే విదేశీ వస్తువులను వాడకూడదంటూ ప్రధాని మోదీ తాజాగా సూచించారు. అయితే, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని మానుకొని, స్వావలంబన సాధించే పరిస్థితి ఇప్పటికిప్పుడు లేదు. ఈ విషయాన్ని గుర్తించకుండా విదేశీ దిగుమతులను కేంద్రం తగ్గిస్తే.. దేశీయంగా ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకొనే ప్రమాదం ఉంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విదేశీ దిగుమతులపై ఇప్పటికిప్పుడు కోత విధిస్తే.. దేశీయ విపణిలో డిమాండ్, సైప్లె మధ్య అంతరం పెరిగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా వస్తూత్పత్తులకు కొరత ఏర్పడి డిమాండ్ అమాంతం పెరుగుతుందని, ఇదే అదునుగా బ్లాక్ మార్కెట్ దందా పెచ్చరిల్లుతుందని గుర్తు చేస్తున్నారు. అలా ప్రతీ వస్తువు ధర పెరిగి.. సామాన్యుడి జేబుకు చిల్లుపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, విదేశీ దిగుమతులను ఆధారంగా చేసుకొని లక్షల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు. వీటిపై ఆధారపడి 10 కోట్ల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని చెప్తున్నారు. కేంద్రం ఒకవేళ విదేశీ దిగుమతులను నిలిపేస్తే, వీరి ఉపాధి కూడా గల్లంతయ్యే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు.