(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): అయోధ్య రామాలయం విరాళాల చోరీపై స్వతంత్ర ఎంపీ రాజేశ్ రంజన్ (పప్పూ యాదవ్) శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో వినూత్నంగా నిరసన చేపట్టారు. విరాళాల చోరీపై ఓ స్కిట్‌ను ప్రదర్శించారు. కాషాయ వస్ర్తాలు ధరించి, ఓ సన్యాసి వేషంలో వచ్చిన పప్పూ యాదవ్.. పార్లమెంట్ పరిసరాల్లో కూర్చొని విరాళాలు సేకరించారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నాయకులు, అయోధ్య ఎంపీ అవధేశ్ ప్రసాద్‌తో పాటు మిగతా ఎంపీలు రుచివీరా, ధర్మేంద్ర యాదవ్ ఈ స్కిట్లో పాల్గొని ఆయన ముందు ఉన్న హుండీలో కొంత డబ్బు వేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంకగాంధీ సైతం హుండీలో కొంత డబ్బు వేశారు. అయితే, హుండీలోని డబ్బును.. నెమ్మదిగా జేబులోకి తోసేసి.. సన్యాసి వేషంలో ఉన్న పప్పూ యాదవ్ అక్కడి నుంచి ఉడాయించే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన అక్కడి ఎంపీలు అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేసినట్టు నటించారు. ఇంతటితో స్కిట్ ముగిసింది.