న్యూఢిల్లీ : పొరుగున ఉన్న మొరాకో నుంచి వేలాదిమంది ఉత్తర ఆఫ్రికా సరిహద్దు తీరం సెయుటాలోకి చొరబడడంతో స్పెయిన్ తన సైనిక దళాలను ఆ ద్వీపకల్పంలో మోహరించింది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 60,000 మందికిపైగా వలసదారులు గడచిన 24 గంటల్లో చొరబడినట్లు స్పానిష్ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఈ ఆకస్మిక వలసదారుల ప్రవాహం స్థానిక అధికారులపై తీవ్ర భారాన్ని మోపడమే గాక వలసలు, సరిహద్దు భద్రత, స్పెయిన్‌కు మొరాకాతో ఉన్న సంబంధాలపై చర్చను లేవనెత్తింది.
స్పానిష్ సరిహద్దుల్లోకి ప్రవేశించే ప్రయత్నంలో 41 మంది మరణించారు. వీరిలో అత్యధికులు సముద్రంలో ఈతకొడుతూ సరిహద్దులు దాటే ప్రయత్నం చేశారు. స్పెయిన్ ప్రభుత్వం సెయుటాకు సైన్యాన్ని తరలించగా పరిస్థితి పునరుద్ధరణలో సహాయపడేందుకు యూరోపియన్ యూనియన్ తన మద్దతును ప్రకటించింది. ఈ తాజా వలసల ప్రవాహం రాజకీయ ఉద్రిక్తతలు రేకెత్తించింది. యూరప్ సరిహద్దులపై ఆందోళనలను వ్యక్తం చేసిన ఇటలీ అసాధారణ చర్యల అవసరాన్ని లేవనెత్తింది. రాజకీయ లబ్ధి కోసం సంక్షోభాన్ని వాడుకునేందుకు కొందరు యూరోపియన్ రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారని స్పానిష్ అధికారులు ఆరోపించారు.
ఆఫ్రికా ఉత్తర తీరంలో ఉన్న ఒక చిన్న స్వయంప్రతిపత్తి కలిగిన స్పానిష్ నగరమే సెయుటా. ఆఫ్రికాతో యూరోపియన్ యూనియన్‌కు ఉన్న ఏకైక భూ సరిహద్దుగా సెయుటా నిలుస్తుంది. 1580 నుంచి స్పానిష్ అధీనంలో ఉన్నప్పటికీ సెయుటాపై స్పానిష్ సార్వభౌమత్వాన్ని మొరాకో గుర్తించడం లేదు. దీన్ని ఆక్రమిత సరిహద్దుగానే మొరాకో పరిగణిస్తుంది. యూరప్‌నకు చేరుకోవాలని ఆశించే వలసదారులకు సెయుటా ఒక తక్కువ దూరంలో ఉన్న మార్గం. మొరాకో పట్టణాలైన ఫ్నిడెక్, బెలియోనెక్, తదితర ప్రదేశాల నుంచి సముద్రంలో ఈదుతూ సరిహద్దుల కంచెలు దాటి సెయుటాలోకి ప్రవేశిస్తుంటారు వలసదారులు. సెయుటాలోకి ప్రవేశించిన వలసదారులు స్పెయిన్ ఆశ్రయాన్ని కోరే అధికారం ఉంది.