హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): హరేకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఎస్ఎంపేటలో నిర్మించనున్న కమ్యూనిటీ కిచెన్ శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం సహా ముగ్గురు మంత్రులు హెలికాప్టర్లో వెళ్లనున్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం డిప్యూటీ సీఎం కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్, ఆర్అండ్బీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూర్ లక్ష్మణ్‌కుమార్ హాజరు కానున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి 10:45 గంటలకు ఎస్‌ఎంపేటకు చేరుకుంటారు. కమ్యూనిటీ కిచెన్‌కు శంకుస్థాపన చేస్తారు. 12:30 గంటలకు పులిచింతల ప్రాజెక్ట్ వద్దకు చేరుకుని హైడ్రో పవర్ ప్రాజెక్టును పరిశీలిస్తారు. 2:15 గంటలకు హెలికాప్టర్లో 3 గంటలకు బేగంపేటకు చేరుకుంటారు.
మంత్రుల హెలికాప్టర్ టూర్‌పై విమర్శలు
కమ్యూనిటీ కిచెన్ శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం సహా ముగ్గురు మంత్రులు హెలికాప్టర్లో వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత చిన్న కార్యక్రమానికి నలుగురు మంత్రులు హాజరుకానుండటంపై పార్టీ శ్రేణులే ముక్కునవేలేసుకుంటున్నారు. ఓవైపు సంక్షేమ పథకాల అమలుకు నిధుల్లేవని చెప్తున్న ప్రభు త్వం.. మరోవైపు బాధ్యాతయుతమైన మంత్రు లు హెలికాప్టర్ టూర్ల పేరిట దుబారా చేయడం ఎంతవరకు సమంజసమని రా జకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కేవ లం ఆర్భాటం కోసం హెలికాప్టర్‌ను వినియోగిస్తున్నారని విమర్శిస్తున్నారు. కేవలం రెండు, మూడు గంటల్లో రోడ్డు మార్గాన వెళ్లే అవకాశం ఉన్నా అధిక ఖర్చుతో హెలికాప్టర్‌ను వాడటం దేనికని ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ పలుమార్లు హెలికాప్టర్లో ప్రయాణానికి మంత్రులు పోటీపడ్డట్టు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.