న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నదని, అయితే రాష్ర్టాలు అందుకు అంగీకరించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి అన్నా రు. ఆ రెండు ఇంధనాలను జీఎస్టీ కిందకు తేవాలంటే రాష్ర్టాలు అంగీకరించాల్సి ఉం టుందని చెప్పారు. సోమవారం శ్రీనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ర్టాలు ముందుకు వస్తే తామూ సిద్ధమేనని, అయితే దానిని ఎలా అమలు చేయాలనేది తనకు సంబంధించిన అంశం కాదని అన్నారు. దానిపై కేంద్ర ఆర్థికమంత్రిని అడగాలన్నారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవడానికి రాష్ర్టాలు ఒప్పుకోవని నొక్కిచెప్పారు. వాటికి మద్యం, ఇంధన చమురు ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయని అన్నారు. ఇది అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదని, ఆదాయం తెచ్చిపెట్టే వనరును ఎవరైనా ఎందుకు వదులుకొంటారని ప్రశ్నించారు. ద్రవ్యోల్బణం వంటి సమస్యలను కేంద్రం మాత్రమే పట్టించుకొంటున్నదని మంత్రి పురి చెప్పారు.