హైదరాబాద్, జూన్ 12 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై కేంద్రప్రభుత్వం ఆంక్షలు తీసుకొచ్చింది. రిటైల్ పెట్రోల్ బంకుల్లో బల్క్‌లో ఇంధన కొనుగోళ్లపై నిషేధం విధించింది. ఒక్కో వాహనానికి లేదా కస్టమర్‌కు రోజుకు 200 లీటర్లకు మించి చమురును విక్రయించకూడదని కండీషన్ పెట్టింది. 90 రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఓ ప్రకటనలో వెల్లడించింది. పారిశ్రామిక, వాణిజ్య, ఇతర వ్యవస్థాగత కొనుగోలుదార్లు ఇకపై రిటైల్ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయకూడదని స్పష్టం చేసింది. అధీకృత బల్క్ సరఫరాదారుల ద్వారా తమకు కావాల్సిన ఇంధనాన్ని కొనుగోలు చేయాలని సూచించింది.
రిటైల్, బల్క్ డీజిల్ ధరల్లో వ్యత్యాసం పెరుగుతున్న క్రమంలో తాజా ఆంక్షలు తీసుకొచ్చినట్టు కేంద్రప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఢిల్లీలోని రిటైల్ పెట్రోల్ బంకుల్లో లీటర్ డీజిల్ ధర రూ.95.20గా ఉంది. బల్క్ సరఫరాదారుల వద్ద డీజిల్ ధర లీటరుకు రూ.134.50గా ఉంది. దీంతో, కొందరు వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం సాధారణ రిటైల్ పెట్రోల్ బంకులవైపు మళ్లుతున్నట్టు అధికారులు గుర్తించారని, దాన్ని అడ్డుకోవడానికే కేంద్రం ఈ నిర్ణయం తీసుకొచ్చినట్టు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. అయితే, కేంద్రం తాజా ఆంక్షలపై పలువురు మండిపడుతున్నారు. వచ్చే 76 రోజులకు సరిపడా పెట్రో నిల్వలు ఉన్నాయంటూ నాలుగైదు రోజుల కిందట గప్పాలు కొట్టిన కేంద్రం.. ఇప్పుడు చమురు కొనుగోళ్లపై ఆంక్షలు విధించడంపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. పెట్రో కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు విధించడాన్ని చూస్తే.. ఆయిల్ నిల్వలపై ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఎన్నికల ముందు ఇంధన ధరలు పెంచబోమని పదేపదే ప్రకటించిన కేంద్రం.. ఎన్నికలు ముగిశాక వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుకుంటూ పోతున్నది. మే 15న లీటర్‌కు రూ.3 చొప్పున తొలిసారిగా రిటైల్ ఇంధన ధరలను పెంచగా ఆ తర్వాత మే 19న 90 పైసలు, మే 23న లీటర్‌కు పెట్రోల్ ధరలు 87 పైసలు, డీజిల్ ధరలు 91 పైసలు పెరిగాయి. మే 26న లీటర్‌కు పెట్రోల్ రూ. 2.61, డీజిల్ రూ. 2.71 మేర పెంచారు. ఇలా 11 రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు కేంద్రం పెట్రో వాతకు దిగింది. మే 15కు ముందు హైదరాబాద్‌లో లీటర్‌కు పెట్రోల్ రూ. 107.46, డీజిల్ రూ. 95.70గా ఉండగా.. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ. 115.69, డీజిల్ రూ. 103.82కు చేరింది. ఇప్పుడు చమురు కొనుగోళ్లపై కేంద్రం విధించిన ఆంక్షలతో బ్లాక్ మార్కెట్ దందా మరింతగా పెరిగి జేబులకు చిల్లు పడటం ఖాయమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.