‘యేరు దాటేదాక ఓడ మల్లన్న..’ అనే చందంగా ఉన్నది కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ వైఖరి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఎలా ఉన్నప్పటికీ ప్రజలపై ఇంధన భారం మోపబోయేది లేదంటూ ఐదు రాష్ర్టాల ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన కేంద్రం.. ఎన్నికలు పూర్తవ్వగానే ప్లేట్ ఫిరాయించింది. 15 రోజుల కిందట గ్యాస్ మోతకు దిగిన కేంద్రం.. ఇప్పుడు పెట్రో వాతపెట్టింది. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ. 3 చొప్పున పెంచుతున్నట్టు ప్రకటించింది. పెట్రో పెంపుతో రవాణా వ్యయం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటాయని, చివరకు తమ జేబులకు చిల్లు పడటం ఖాయమని సామాన్యులు లబోదిబోమంటున్నారు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సామాన్యుడి నెత్తిపై పెట్రో బాంబు వేసింది. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ. 3 చొప్పున పెంపు విధించింది. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చినట్టు ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ మార్కెట్లలో చమురు ధరలు పెరుగడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు వివరించాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 110.89కి, లీటర్ డీజిల్ రూ. 98.96కు చేరుకొన్నది. మరోవైపు, సీఎన్జీ ధరలను కూడా పెంచుతున్నట్టు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. కిలో సీఎన్జీపై రూ. 2 పెంపు విధించినట్టు వెల్లడించాయి. తాజా పెంపుతో కిలో సీఎన్జీ రూ. 79.09కు చేరింది.
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఎలా ఉన్నప్పటికీ ప్రజలపై ఇంధన భారం మోపబోయేది లేదంటూ ఐదు రాష్ర్టాల ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన కేంద్రం.. ఎన్నికలు పూర్తవ్వగానే ప్లేట్ ఫిరాయించింది. ఈ నెల 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై ఏకంగా రూ. 993 వడ్డించిన కేంద్రం.. ఇప్పుడు పెట్రోవాతకు దిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారెల్ ముడి చమురు ధర నాలుగేండ్ల కనిష్ఠానికి చేరినప్పటికీ, రష్యా చవగ్గా చమురును విక్రయించినప్పటికీ.. దేశీయంగా ఇంధన ధరలను ఏమాత్రం తగ్గించని కేంద్ర సర్కారు.. ఇప్పుడు పశ్చిమాసియా ఉద్రిక్తతల నెపంతో పెట్రోవాతకు తెగబడటంపై ఆర్థిక నిపుణులు మండిపడుతున్నారు. పెట్రోవాతతో రవాణా వ్యయం పెరిగి నిత్యావసరాలు సహా అన్ని రకాల వస్తువులు, సేవల ధరలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు.
మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. 12 ఏండ్ల వ్యవధిలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 41.26 శాతం, 78.37 శాతం మేర పెరిగాయి. 2014లో లీటర్ పెట్రోల్ రూ. 78.5గా ఉంటే ప్రస్తుతం రూ. 110.89కు చేరింది. అప్పుడు లీటర్ డీజిల్ రూ. 55.48గా ఉంటే ఇప్పుడు రూ. 98.96 కు పెరిగింది. ఇక, బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్ ధరలు కూడా భారీగా పెరిగాయి. 14 కిలోల గృహ వినియోగదారుల సిలిండర్ 2014లో రూ. 414గా, 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రూ. 1,692గా ఉంటే ప్రస్తుతం వాటి ధరలు వరుసగా రూ. 965కు (పెరుగుదల 133.09%), రూ. 3,315కు (పెరుగుదల 95.92%) ఎగబాకాయి.
పెట్రో ధరల పెంపును వ్యతిరేకిస్తూ కేంద్రంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఎన్నికలు ముగియగానే మోదీ వసూళ్లు మొదలయ్యాయంటూ కాంగ్రెస్ మండిపడింది. రూ.3 పెంపు షాక్ మాత్రమే కాకుండా మరిన్ని వడ్డింపులు వాయిదాల్లో రానున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల తర్వాత పెంపు ఊహించిందేనంటూ టీఎంసీ దుయ్యబట్టింది. పెట్రో పెంపును ఉద్దేశిస్తూ ఎక్స్‌లో స్పందించిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్.. మీరు (ప్రజలు) ముందుకు సాగాలంటే, సైకిల్ ఒక్కటే ఆప్షన్ అంటూ ట్వీట్ చేశారు. ప్రభుత్వ విధానపరమైన వైఫల్యాలతో ఈ పరిస్థితి దాపురించిందన్న సీపీఎం.. కేంద్రం చేసిన తప్పులకు సామాన్యులపై భారం పడుతున్నదని మండిపడింది.
