న్యూఢిల్లీ: గ్యాస్, పెట్రోల్ కొరత నేపథ్యంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కిరోసిన్ పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణ సహా 21 రాష్ర్టాలు, యూటీల్లో కిరోసిన్‌ను పంపిణీ చేయబోతున్నది. అంతేగాక పెట్రోల్ బంకుల ద్వారా కిరోసిన్ అమ్మకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కిరోసిన్ అమ్మకాలపై ప్రస్తుతమున్న నిబంధనల్ని సడలిస్తూ కేంద్రం 60 రోజుల అత్యవసర చర్యల్ని చేపట్టింది. ఈ మేరకు తాజాగా ఓ గెజిట్ నోటిఫికేషన్‌ను జారీచేసింది.
దీని ప్రకారం, కిరోసిన్ రహిత రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ ‘పీడీఎస్ కిరోసిన్’ సరఫరాను పునరుద్ధరించింది. ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో పరిమిత స్థాయిలో సుపీరియర్ కిరోసిన్ (ఎస్‌కేవో) అమ్మకాలకు అనుమతించారు. వంటగ్యాస్ కొరత తీవ్రస్థాయిలో ఉన్నందున ఎల్పీజీ కోసం ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకునేందుకు కేంద్రం ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తున్నది.