న్యూఢిల్లీ: మనదేశంలో ఏఐ, చాట్ జీపీటీ టెక్నాలజీ వాడకం అనూహ్యంగా పెరిగిపోయింది. అయితే ఈ రెండింటినీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వాడటం అత్యంత ప్రమాదకరమని కేంద్రం తాజాగా పేర్కొన్నది. దేశానికి సంబంధించిన రహస్య సమాచారమంతా బయటకు వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి చెందిన సమాచారాన్ని మరింత ఎక్కువగా, చక్కగా తీర్చిదిద్దేందుకు కొందరు అధికారులు ఏఐ, చాట్ జీపీటీల ద్వారా షేర్ చేస్తున్నట్టు కేంద్రం తెలిపింది.
దీనివల్ల మనదేశంలో ఏం జరుగుతున్నది? ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న పనులు, ఇతర కీలక సమాచారం అంతా ఏఐ, చాట్‌జీపీటీ ద్వారా పక్క దేశాలకు చేరుతున్నట్టు కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. వీటిని అరికట్టేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద సభకు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులెవరూ ఈ రెండు వేదికల్లో (ఏఐ, చాట్ జీపీటీ) ప్రభుత్వ సమాచారాన్ని షేర్ చేయరాదంటూ ఆదేశాలు జారీ చేసినట్టు మంత్రి తెలిపారు.