న్యూఢిల్లీ, జూలై 20: ఉగ్రదాడుల లక్షిత దాడులు, హత్యల నేపథ్యంలో ఇటీవలి కాలంలో కశ్మీర్ పండిట్లలో భయానక పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇటువంటి ఆందోళనకర పరిస్థితులతో అనేక మంది పండిట్లు, ఇతర హిందూ మైనార్టీ ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. అయితే కశ్మీర్ నుంచి పండిట్ల వలసకు సంబంధించిన నివేదికలు, మీడియా కథనాలు, పండిట్ల, ఇతర హిందూ కమ్యూనిటీల ప్రజల ఆందోళనలు, సామూహిక వలసలను చూపుతూ ప్రచారమైన వీడియోలు, ఫొటోలు అన్నీ అబద్ధం… మేము చెప్పేది మాత్రమే నిజం అని కేంద్రంలోని మోదీ సర్కార్ చెబుతున్నది.
జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన 2019, ఆగస్టు 5 నాటి నుంచి 2022 జూలై 9 వరకు కశ్మీర్ లోయ నుంచి ఏ ఒక్క పండిట్ కూడా ఇతర ప్రాంతాలకు వలస పోలేదట! ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. రికార్డు పరంగా వలసలేమీ లేవన్నారు. ఇదే కాలంలో ఉగ్రదాడుల సంఖ్య కూడా తగ్గిందని పేర్కొన్న ప్రభుత్వం.. పలు దాడుల్లో మరణించిన పౌరుల్లో ఐదుగురు పండిట్లు, 16 మంది ఇతర హిందూ లేదా సిక్కు కమ్యూనిటీకి చెందిన వారు ఉన్నారని తెలిపింది.