PR Machine | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ ప్రధాని మోదీపై చేసిన కామెంట్లు భారత రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఇంకో వైపు యూజర్ల నుంచి ఫిర్యాదులు వచ్చాయని గ్రోక్ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో ఈ వ్యవహారం ‘మోదీ వర్సెస్ మస్క్’గా మారింది. ఇంకోవైపు ప్రభుత్వం కంటెంట్ నియంత్రణకు పాల్పడుతున్నదని ఎక్స్ సంస్థ కర్ణాటక హైకోర్టులో కేంద్రంపై దావా వేసింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు గ్రోక్‌ను ప్రశంసిస్తుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు.
బీజేపీ నేతలు ఏకంగా ‘గో బ్యాక్ గ్రోక్’ నినాదాన్ని మొదలు పెట్టారు. తాజాగా ప్రధానిపై గ్రోక్ చేసిన కామెంట్లతో ఈ అగ్గి రాజుకున్నది. 2014 తర్వాత ప్రధాని మోదీ పెద్దగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు హాజరు కాకపోవడంపై విశ్లేషించాలని ఓ నెటిజన్ గ్రోక్‌ను కోరారు. దీనికి గ్రోక్ స్పందిస్తూ మోదీని ‘పీఆర్ మెషీన్’గా (ప్రచార యంత్రం) పేర్కొన్నది. 2014 తర్వాత ప్రధాని మోదీ ఒక్కసారి మాత్రమే 2019లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారని పేర్కొన్నది. అన్ని అంశాలపై మాట్లాడే బాధ్యతను కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అప్పగించారంటూ ఎద్దేవా చేసింది.
గ్రోక్ అభిప్రాయాలపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు నెటిజన్లు గ్రోక్‌ను అభినందిస్తున్నారు. ఇది సూటిగా, నిర్భయంగా సమాధానాలు ఇస్తుందని కొందరు ప్రశంసిస్తున్నారు.మరికొందరు మాత్రం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని మాత్రమే విశ్లేషించి, తన అభిప్రాయం చెప్పిందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. గ్రోక్‌ను షట్ డౌన్ చేయాలని మండిపడుతున్నారు.
గ్రోక్ వ్యవహారం కేంద్రం వర్సెస్ ఎక్స్‌గా మారింది. ఇటీవల ఓ వ్యక్తి గ్రోక్‌ను అడిగిన ప్రశ్నకు హిందీలో సమాధానం ఇచ్చింది. అయితే ఇందులో కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్టు కేంద్రం గుర్తించింది. దీంతో ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఐటీ శాఖ ఎక్స్‌ను అడిగింది. మరోవైపు ప్రధానిపై గ్రోక్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నిరసనలు తెలుపుతున్నది. ‘గ్రోక్ గో బ్యాక్’ అంటూ తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.
సోషల్ మీడియాలో సైతం బీజేపీ కార్యకర్తలు, సానుభూతిపరులు గ్రోక్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై ఎక్స్ సంస్థ కర్ణాటక హైకోర్టులో కేసు వేసింది. కేంద్ర ప్రభుత్వం ఐటీ యాక్ట్ సెక్షన్ 79(3)(బీ)ని సాకుగా చూపుతూ ఎక్స్‌లో ఉన్న సమాచారాన్ని తొలగించాలని ఆదేశాలు జారీ చేస్తున్నదని తెలిపింది. ఇది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ‘ఆన్లైన్లో భావస్వేచ్ఛా ప్రకటన’ తీర్పునకు వ్యతిరేకమని వాదించింది.
కేంద్రం ఈ సెక్షన్‌ను వాడుకొని ఎక్స్‌లో ఏ సమాచారం ఉండాలో, ఏది తీసేయాలో నిర్ణయిస్తున్నదని ఆరోపించింది. ఎక్స్‌లో ఉన్న సమాచారాన్ని బ్లాక్ చేయిస్త్నుదని విమర్శించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కోర్టు ఆదేశాలు ఉంటే మాత్రమే సోషల్ మీడియా సంస్థలు తమ వేదికల్లోని సమాచారాన్ని బ్లాక్ చేస్తున్నదని విమర్శించింది. తమ కంటెంట్‌పై నిర్ణయం తీసుకునే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదని ఎక్స్ వాదించింది. దీంతో ఈ వ్యవహారం ఇంతటితో ముగియదని, భవిష్యత్తులో మరింత చర్చకు దారి తీయొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.