న్యూఢిల్లీ: ఉల్లిపాయలను ఎక్కువగా పండించే మహారాష్ట్రలో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో రైతులను మచ్చిక చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాలకు ఎగుమతి చేసే ఉల్లిపాయలకు కనీస ఎగుమతి ధర నిబంధనను శుక్రవారం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ రద్దు చేసింది.
గతంలో విధించిన నిబంధన ప్రకారం ఉల్లిని ఎగుమతి చేయాలంటే, టన్నుకు కనీసం 550 డాలర్లు ధర ఉండాలి. మరోవైపు, బాస్మతి బియ్యం ఎగుమతికి కనీస ఎగుమతి ధర (ఎంఈపీ) టన్నుకు కనీసం 950 డాలర్లు ఉండాలన్న నిబంధనను కూడా కేంద్రం తొలగించింది.
గోధుమల నిల్వలపై కేంద్రం ఆంక్షలు
న్యూఢిల్లీ: గోధుమల అక్రమ నిల్వలు, ధరల పెరుగుదలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సవరించిన నిబంధనల ప్రకారం, ట్రేడర్లు, హోల్‌సేలర్లు 2,000 టన్నుల వరకు మాత్రమే గోధుమలను నిల్వ చేసుకోవచ్చు. గతంలో ఇది 3,000 టన్నులుగా ఉండేది. బిగ్ చైన్ రిటైలర్లు ఒక్కొక్క ఔట్‌లెట్‌కు 10 మెట్రిక్ టన్నుల వరకు తమ డిపోలో నిల్వ చేసుకోవచ్చు.
గతంలో దీనిపై ఆంక్షలు ఉండేవి కాదు. ప్రాసెసర్లు మంత్లీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ (ఎంఐసీ)లో 60 శాతం వరకు నిల్వ చేసుకోవచ్చు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నెలలకు ఈ విధంగా నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఇది ఎంఐసీలో 70 శాతంగా ఉండేది. 10 టన్నుల గోధుమల వరకు నిల్వ ఉంచుకునే వ్యక్తిగత రిటైలర్ల విషయంలో ఎటువంటి మార్పులు లేవు.