న్యూఢిల్లీ, నవంబర్ 5: కచ్చితత్వం లేని, పక్షపాతంతో కూడిన సమాచారాన్ని ‘వికీపీడియా’లో ఇస్తున్నారన్న ఫిర్యాదులపై కేంద్రం స్పందించింది. ఫిర్యాదుల్లోని అంశాలు పేర్కొంటూ‘వికీపీడియా’కు మంగళవారం నోటీసులు జారీచేసింది. ఒక సమాచార మాధ్యమంగా కాకుండా ప్రచురణకర్త (పబ్లిషర్)గా ఎందుకు భావించరాదో తెలపాలంటూ నోటీసు పేర్కొన్నది. ఆన్లైన్ ఎన్సైక్లోపీడియాగా పిలిచే వికీపీడియాను ఇటీవలే ఢిల్లీ హైకోర్టు మందలించింది.
వికీపీడియా అనుసరిస్తున్న ‘ఓపెన్ ఎడిటింగ్ మోడల్’ను తప్పుబట్టింది. ఇతరుల పరువుకు భంగం వాటిల్లే ప్రమాదముందని హైకోర్టు హెచ్చరించింది. కాగా ఆ సంస్థ తన ఎడిటింగ్ మోడల్‌ను సమర్థించుకున్నది. దీనికి చట్టపరమైన సమ్మతి ఉందని చెబుతున్నది.
ఓ వార్తా ఏజెన్సీ కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వానికి ప్రచార సాధనంగా మారిందని ‘వికీపీడియా’ పేర్కొనటం వివాదానికి దారితీసింది. దీనిపై గత సెప్టెంబర్‌లో సదరు వార్తా ఏజెన్సీ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేసింది. వికీపీడియా అనుసరిస్తున్న ‘ఓపెన్ ఎడిటింగ్ ఫీచర్స్’ చాలా ప్రమాదకరమని కోర్టు అభిప్రాయపడింది. ఈనేపథ్యంలో కేంద్రం వికీపీడియాకు నోటీసులు జారీచేయటం గమనార్హం.