Jamili Elections | న్యూఢిల్లీ, డిసెంబర్ 9: దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సమాయత్తమవుతున్నది. ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బిల్లును సభలో ప్రవేశపెట్టిన తర్వాత విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి(జేపీసీ) సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్టు తెలిపాయి. ఈ బిల్లుపై చర్చించేందుకు అన్ని రాష్ర్టాల అసెంబ్లీల స్పీకర్లనూ ఆహ్వానించనున్నట్టు సమాచారం. కాగా, జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇప్పటికే నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే.
లోక్‌సభతో పాటు అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత 100 రోజులకు అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని కోవింద్ కమిటీ సిఫార్సు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సెప్టెంబర్‌లో ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు అప్పుడే ప్రచారం జరిగింది. అయితే, పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు బిల్లుపై ఏకాభిప్రాయ సాధన కోసం కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరిపే బాధ్యతలను ప్రభుత్వం కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అర్జున్‌రామ్ మేఘ్వాల్, కిరణ్ రిజిజుకు అప్పగించింది.
తమ పట్ల వివక్షా వైఖరిని ప్రదర్శిస్తున్న రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు యోచిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన తీర్మానంపై 50 మంది ప్రతిపక్ష ఎంపీలు సంతకం చేసినట్టు ఆ వర్గాలు సోమవారం తెలిపాయి. రాజ్యసభ నుంచి తాము తరచు వాకౌట్ చేయాల్సిన పరిస్థితికి చైర్మన్ ధన్ఖర్ వైఖరే కారణమని విపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు చైర్మన్ తగినంత సమయాన్ని కేటాయించడం లేదని వారు భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.
రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేందుకు లేచి నిలబడినపుడు చైర్మన్ ఆయనకు అవకాశం ఇవ్వాలని, కాని కాంగ్రెస్ అధ్యక్షుడు, సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే లేచి నిలబడగానే మైక్రోఫోన్‌ను చైర్మన్ తరచు కట్ చేస్తున్నారని విపక్ష ఎంపీలు వాదిస్తున్నారు. పార్లమెంటరీ నిబంధనలు, సాంప్రదాయాల ప్రకారం సభ నడవాలని, కాని తాము ఫిర్యాదు చేసిన ప్రతిసారి తమను ఛాంబర్లోకి పిలిచి సర్దుబాటు చేసేందుకు చైర్మన్ ప్రయత్నిస్తున్నారే తప్ప నిబంధనలను పాటించాలని భావించడం లేదని సీనియర్ ప్రతిపక్ష నాయకుడు ఒకరు తెలిపారు. చైర్మన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన పక్షంలో భారత పార్లమెంటరీ చరిత్రలోనే ఇది మొదటిసారి అవుతుంది.
అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్‌తో కాంగ్రెస్‌కు సంబంధాలు ఉన్నాయని బీజేపీ చేసిన ఆరోపణలు పార్లమెంటు ఉభయసభలను కుదిపేశాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి జార్జ్ సోరోస్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబేపై ప్రివిలేజ్ మోషన్ కోసం కాంగ్రెస్ సభ్యులు నోటీసు ఇచ్చారు. బీజేపీ అబద్ధపు ఆరోపణలు చేస్తున్నదని, దూబేపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. సోరోస్‌తో సంబంధాలపై కాంగ్రెస్ జవాబు చెప్పాలని బీజేపీ సభ్యులు సైతం నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొన్నది.
మూడుసార్లు వాయిదా వేసినా సభ ఆర్డర్‌లోకి రాకపోవడంతో ఒక రోజు వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. సభ ప్రారంభం కాగానే సోరోస్ అంశాన్ని బీజేపీ సభ్యులు లేవనెత్తారు. సోరోస్‌తో కలిసి దేశాన్ని అస్థిరపరచాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని బీజేపీ సభ్యులు ఆరోపిస్తూ నినాదాలు చేశారు. అయితే, అదానీ అంశం నుంచి దృష్టి మళ్లించేందుకే బీజేపీ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. ఇరువైపులా నినాదాలతో గందరగోళం నెలకొన్నది. పలుమార్లు సభ వాయిదా పడిన తర్వాత కూడా అధికార, విపక్ష సభ్యుల నినాదాలు కొనసాగడంతో రాజ్యసభ ఒక రోజు వాయిదా పడింది.