న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం తీపికబురు చెప్పింది. దీపావళి కానుకగా కరవు భత్యాన్ని (డీఏ) 3 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలను ఆమోదించినట్టు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు.
డీఏ పెంపు ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. దీని వల్ల దాదాపు 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 64.89 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని, కేంద్ర ఖజానాపై రూ.9,448 కోట్ల అదనపు భారం పడుతుందని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్లో డీఏను 4 శాతం పెంచిన విషయం తెలిసిందే. తాజాగా పెంపుతో ఇది 50 నుంచి 53 శాతానికి చేరుతుంది. మరోవైపు, వారణాసి-పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ (డీడీయూ) జంక్షన్ మధ్య రూ.2,642 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టుకు కూడా కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.