ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. దీనిపై కేంద్రం హోంశాఖ కూడా దృష్టి సారించింది. పంజాబ్ సీఎం చెన్నీ ట్వీట్ చేస్తూ… ‘ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ చేసిన వ్యాఖ్యలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించాలని పంజాబ్ సీఎంగా ప్రధాని మోదీని కోరుతున్నాను. రాజకీయాలను పక్కన పెడితే, వేర్పాటువాదంపై పోరాడే విషయంలో పంజాబ్ ప్రజలు భారీ మూల్యాన్నే చెల్లించుకున్నారు. ప్రతి పంజాబీ భయాన్ని దూరం చేయాల్సిన బాధ్యత ప్రధాని మోదీపై ఉంది’ అంటూ పంజాబ్ సీఎం చెన్నీ ట్వీట్ చేశారు.
స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
‘ఓ వేర్పాటు వాద సంస్థ, దేశాన్ని వ్యతిరేకించే వేర్పాటువాద సంస్థతో ఓ రాజకీయ పార్టీ సంబంధాలు నెరపడం చాలా గంభీరమైన అంశం. దేశ అంఖడత్వ దృష్టితో చూసినా.. ఇది గంభీరమైన అంశమే. శత్రువుల అజెండాకూ, వీరి అజెండాకూ ఏమీ తేడా లేదు. అధికారం కోసం వేర్పాటువాదులతో చేతులు కలపడం ఖండించే అంశమే. ఇది ఎంత దూరమైనా వెళుతుంది. భారత ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. దేశ అంఖడత్వాన్ని దెబ్బతీస్తామంటే ఎవర్నీ ఉపేక్షించం. దీనిపై చాలా లోతుగానే ఆలోచిస్తాం’ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ట్వీట్ చేశారు.
కుమార్ విశ్వాస్ ఏమన్నారంటే…
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏదో ఒక రోజు పంజాబ్ ముఖ్యమంత్రి అయినా, లేదంటే ఖలిస్తాన్ ప్రధాని అయినా అవుతానని సీఎం కేజ్రీవాల్ తనతో అన్నారని కుమార్ విశ్వాస్ వెల్లడించారు. పంజాబ్ అంటే సీఎం కేజ్రీవాల్‌కు ఏమాత్రం అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. పంజాబ్ అంటే రాష్ట్రం కాదని, అదో భావన అని ఆయన పేర్కొన్నారు.
‘నేను మొదటి నుంచి చెబుతూనే వస్తున్నా. వేర్పాటువాదులు ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతిచ్చే వారితో కలవొద్దని నేను చెప్పాను. కాదు.. కాదు.. నేను కలుస్తానని అన్నారు. ఏమీ ఆలోచించాల్సిన పనిలేదన్నారు. అయితే వేర్పాటువాదులతో చేతులు కలపొద్దని నేను అన్నాను. ఏమవుతుంది? నేనే మొట్ట మొదటి ప్రధాని అవుతా. అని కేజ్రీవాల్ అన్నారు. అలాగే పంజాబ్ సీఎం కావడానికి కూడా ఆయన ప్రణాళికలు వేసుకున్నారు. ఇప్పటికీ ఆ ఊహల్లోనే వుంటారు అని’ కుమార్ విశ్వాస్ వెల్లడించారు. అధికారం కోసం కేజ్రీవాల్ ఏమైనా చేయగలరని కుమార్ విశ్వాస్ విమర్శించారు.