న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఎల్పీజీ, పెట్రోరసాయనాల సరఫరాపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఫార్మసీ, వైద్య పరికరాల తయారీ పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఫలితంగా పారాసిటమాల్ వంటి సాధారణ మందులతోపాటు గ్లవ్స్లు, సిరంజీలు వంటి వైద్య ఉత్పత్తుల తయారీపై కూడా ప్రభావం పడుతున్నది.
కొవిడ్ మహమ్మారి సమయంలో మాదిరిగానే వీటిని అత్యవసర వస్తువులుగా పరిగణిస్తూ వీటి తయారీ కొనసాగడానికి మినహాయింపులను కోరుతూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ, రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ కింద పనిచేసే ఫార్మాస్యూటికల్స్ విభాగానికి పారిశ్రామిక సంఘాలు లేఖ రాశాయి.
ఫార్మాస్యూటికల్ పరిశ్రమకు ఎల్పీజీ, పీఎన్జీ సరఫరాలో అంతరాయం కాని, కోతలు కాని ఉండరాదని కోరుతూ ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్, ఇండియన్ డ్రగ్ మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఫార్మా ఆంత్రప్రెన్యూర్స్ సంబంధిత మంత్రిత్వశాఖలకు వినతిపత్రాలను సమర్పించాయి. వీటి సరఫరాకు ఎటువంటి అంతరాయం జరిగినా దాని ప్రభావం వెంటనే దేశానికి, ప్రపంచానికి అవసరమైన కీలక మందుల తయారీపై పడుతుందని, మందుల తయారీలోని అనేక కీలక ప్రక్రియల్లో ఈ వాయువులను ఉపయోగిస్తారన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలిపాయి.
గృహవినియోగదారులకు సరఫరా చేసేందుకు ఎల్పీజీ ఉత్పత్తిని పెంచి కొన్ని పెట్రోరసాయనాల సరఫరాను తగ్గించాలన్న ప్రభుత్వ ఉత్తర్వు కారణంగా అనేక ముఖ్యమైన మందులు, వైద్య పరికరాల ఉత్పత్తి ఆగిపోనున్నది. అనేక సాధారణ మందులలో పైపూతకు అవసరమైన ఇసోప్రోపైల్ ఆల్కహాల్(ఐపీఏ) గ్రేడ్ ఫార్మకోపియా ఉత్పత్తి కోసం అవసరమైన రిఫైనరీ గ్రేడ్ ప్రాపిలీన్కు అత్యవసరంగా కొరత ఏర్పడనున్నది.
తమ వద్ద ఉన్న ప్రాపిలీన్ నిల్వలు ముగిసిన తర్వాత మరో వారం లేదా 10 రోజుల్లో దాదాపు 200 తయారీదారులు తమ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉందని సెంటర్ ఫర్ డొమెస్టిక్ ఎకానమీ పాలసీ రిసెర్చ్(సీడీఈపీ) ఫార్మాస్యూటికల్ విభాగానికి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నది. జాతీయ అత్యవసర ఔషధాల జాబితాలో పొందుపరిచిన కనీసం 14 చికిత్సా విభాగాల్లోని మందుల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుందని సీడీఈపీ అధ్యక్షుడు డాక్టర్ జైబిత్ భట్టాచార్య తెలిపారు. బెంజీన్ సరఫరాలో అంతరాయం ఫలితంగా సాధారణ జ్వరానికి వాడే పారాసిటమాల్తోసహా అనేక క్రియాశీల మందుల తయారీని ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.