Union Budget | కేంద్ర బడ్జెట్.. కాకి లెక్కలతోనే సరిపోయింది. రూ.53.47 లక్షల కోట్లతో వచ్చినా ఏ రంగాన్నీ సంతృప్తిపర్చకుండానే మోదీ సర్కార్ ముగించేసింది. ఆదాయ పన్ను జోలికే వెళ్లకుండా వేతన జీవులను నిరాశపర్చిన నిర్మలమ్మ.. పొదుపు-మదుపుల ఊసే ఎత్తకపోవడం గమనార్హం. ఓవైపు ఆహారం, ఎరువులు, ఇంధన రాయితీలకు కోతలు.. మరోవైపు స్టాక్ మార్కెట్లను కుదేలు చేసేలా సెక్యూరిటీస్ ట్రాన్జాక్షన్ ట్యాక్స్ వాతలతో లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం సాగింది మరి. 90 నిమిషాలపాటు మాట్లాడినా పెద్దగా ఆకట్టుకునే ఒక్క ప్రకటన కూడా లేకపోవడంతో అన్ని వర్గాలనూ ఊరించి ఉసూరుమనిపించినట్టే అయ్యింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వార్షిక బడ్జెట్ ఊరించి ఉసూరుమనిపించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్లో పద్దును ప్రవేశపెట్టారు. ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్టు గతంతో పోల్చితే ఈసారి లెక్క పెరిగినా.. కీలక రంగాలకు మాత్రం మొండి చెయ్యే దక్కింది. ఏకంగా రూ.53.47 లక్షల కోట్లతో ఈసారి బడ్జెట్‌ను ప్రకటించారు. అయినప్పటికీ ఏ రంగాన్నీ సంతృప్తిపర్చకుండానే ముగించారు.
ఈసారి బడ్జెట్ ఉద్యోగుల్ని విస్మరించింది. వ్యక్తిగత ఆదాయ పన్ను (ఐటీ) విధానాల్లో ఎలాంటి మార్పుల్నీ చేసేందుకు మోదీ సర్కార్ సిద్ధపడలేదు. నిజానికి స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచాలన్న డిమాండ్లు గట్టిగా వినిపించాయి. ప్రస్తుతం ఇది రూ.75,000గానే ఉన్నది. అలాగే కొత్త పన్ను విధానంలో రూ.24 లక్షల వార్షికాదాయం దాటితే పడుతున్న 30 శాతం పన్నును రూ.30 లక్షలు దాటితేనే వర్తింపజేయాలన్న డిమాండ్లూ వచ్చాయి. 25 శాతం స్లాబును రూ.30 లక్షలకు పొడిగించాలని అంతా కోరారు మరి. అయినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదు. ఇక పొదుపు-మదుపులకు పెద్దపీట వేసేలా ఉండే పాత ఆదాయ పన్ను విధానాన్నీ సవరించాలని, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఉద్యోగులు, ఆర్థిక నిపుణులు మొత్తుకున్నా వినలేదు. దాంతో ఎప్పట్లాగే ఓల్డ్ ట్యాక్స్ విధానం ఈసారీ ఎక్కడిదక్కడే ఉండిపోయింది.
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌పై సెక్యూరిటీస్ ట్రాన్జాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ)ను పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించారు. డెరివేటివ్లలోగల ఊహాజనిత ట్రేడింగ్ వల్ల చిన్న మదుపరుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని, అందుకే వారిని నిరుత్సాహపర్చడానికే ఈ పెంపు అని మంత్రి తెలిపారు. ఈ క్రమంలోనే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్‌పై ఎస్టీటీని 0.02 శాతం నుంచి 0.05 శాతానికి పెంచారు. అలాగే ఆప్షన్స్ ప్రీమియం, ఎక్సైజ్ ఆప్షన్స్ రెండింటిపైనా 0.15 శాతానికి పెంచుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఇవి వరుసగా 0.1 శాతంగా, 0.125 శాతంగా ఉన్నాయి.
వాటాదారులు జరిపే బైబ్యాక్ షేర్ల ప్రక్రియను క్యాపిటల్ గెయిన్స్‌గానే పరిగణించడం జరుగుతుందని, వీటికి పన్నులు వర్తిస్తాయని బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. దీంతో బైబ్యాక్ ప్రోగ్రామ్‌లకు ఇక బ్రేకులు పడుతాయన్న అభిప్రాయాలైతే వినిపిస్తున్నాయి. దీనివల్ల ఈక్విటీ మార్కెట్లలోని ప్రమోటర్లు, పెట్టుబడులు పెడుతున్న మదుపరులకు నిరాశేనని అంటున్నారు. కాగా, కార్పొరేట్ ప్రమోటర్లకు 22 శాతం, నాన్-కార్పొరేట్ ప్రమోటర్లకు 30 శాతం పన్నులుంటాయి. డెరివేటివ్‌లపై ఎస్టీటీ 150 శాతం, 50 శాతం చొప్పున పెంపు నేపథ్యంలో ఈ నిర్ణయం ఇన్వెస్టర్లపై ఒత్తిడిని పెంచవచ్చంటున్నారు.
ప్రస్తుతేడాది నిర్దేశించుకున్న రూ.40 వేల కోట్లతో పోలిస్తే రెండింతలు పెంచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రూ.40 వేల కోట్లలో కేవలం రూ.8 వేల కోట్లు మాత్రమే సేకరించింది. మరో రెండు నెలల మాత్రమే మిగిలివున్నప్పటికీ లక్ష్యానికి చేరుకునే అవకాశాలు కనిపించడం లేదు. పీఎస్‌యూ బ్యాంక్‌లో వాటా విక్రయానికి ముందుకొచ్చినప్పటికీ ఎన్నో అవాంతరాలు తలెత్తడంతో వెనక్కి తగ్గింది. మరోవైపు, ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల నగదీకరణకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వరంగ బ్యాంకులైన సెంట్రల్ బ్యాంక్, యూకో, పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌ల్లో వాటా విక్రయించడానికి కూడా పావులు కదుపుతున్నది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ మోదీ సర్కార్ భారీ స్థాయిలో వాటాలను విక్రయించబోతున్నది. ప్రభుత్వరంగ సంస్థలను వదిలించుకోవడం లేదా వాటాల విక్రయం, ఆస్తుల నగదీకరణ ద్వారా గరిష్ఠంగా రూ.80 వేల కోట్ల వరకు నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. 2026-27లో ఐడీబీఐ బ్యాంక్‌తోపాటు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పలు పీఎస్‌యూల్లో వాటాలను విక్రయించబోతున్నది.

విదేశీ సంస్థలకు రాచబాటవేసింది సార్వత్రిక బడ్జెట్. దేశవ్యాప్తంగా క్లౌడ్ సర్వీసుల కోసం వినియోగించే డాటా సెంటర్లను ఏర్పాటు చేసే విదేశీ సంస్థలకు 2047 వరకు ట్యాక్స్ హాలిడే ప్రకటించింది మోదీ సర్కార్. కీలక మౌలిక సదుపాయాలు కల్పించడం, డాటా సెంటర్లలో పెట్టుబడులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ డాటా సెంటర్ల ద్వారా దేశీయ, అంతర్జాతీయ కస్టమర్లకు సేవలు అందించాల్సి ఉంటుందని తెలిపింది.
బడ్జెట్లో మౌలిక రంగానికి పెద్దపీట వేశామని, మూలధన వ్యయాన్ని పెంచామని, దీర్ఘకాలిక వృద్ధిరేటును లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్తున్నారు. కానీ సామాన్యులకు ఊరటనిచ్చే అంశాలే లేవని, ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లకూ పరిష్కారం చూపలేదని, మదుపరుల సెంటిమెంట్‌నూ దెబ్బతీశారని మార్కెట్ నిపుణులు, ప్రతిపక్షాలు, ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఈ పద్దులోని ప్రతికూలతల్ని పరిశీలిస్తే..
వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) మొదలు (ఏప్రిల్ 1 నుంచి) కొత్త ఆదాయ పన్ను (ఐటీ) చట్టం-2025 అమల్లోకి రాబోతున్నది. త్వరలోనే నిబంధనలు, ట్యాక్స్ రిటర్న్స్ ఫారాలను తెస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో స్పష్టం చేశారు. 60 ఏండ్ల కిందటి పాత పన్ను విధానం స్థానంలో ఈ కొత్త ఐటీ విధానాన్ని పలు మార్పులు చేసి తెస్తున్న సంగతి విదితమే. ఇదిలావుంటే నామమాత్రపు రుసుము చెల్లింపుతో సవరించిన ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలుకున్న గడువు డిసెంబర్ 31 నుంచి మార్చి 31దాకా పొడిగించారు.
2026-27కుగాను రూ.53.47 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ ఆశించిన స్థాయిలో లేదు. భవిష్యత్తుపై ఈ పద్దుతో మాకున్న భయాలు మరింత పెరిగాయి.- భారతీయ ఆంత్రప్రెన్యూర్స్సంఘం
73,990 కోట్లు కేంద్ర బడ్జెట్లో టెలికాం రంగానికి కేటాయించిన నిధులివి. నిరుడుతో పోల్చితే ఈసారి 38 శాతం పెరిగాయి. ఇక ఈ ఏడాది ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్కు రూ.28,473 కోట్లు దక్కాయి.
బయోలాజిక్స్, బయోసిమిలర్స్ విభాగంలో భారత్ అగ్రగామి దేశాల సరసన నిలిచేందుకు ఉన్న అవకాశాలు అందిపుచ్చుకోవడానికి బడ్జెట్లో కీలక ప్రతిపాదనలు చేశారు. బయోఫార్మా శక్తి పథకానికి రూ.10 వేల కోట్ల నిధులను వెచ్చించడంతో దేశాన్ని నాణ్యమైన ఔషధాల ప్రపంచ సరఫరాదారు స్థాయి నుంచి గ్లోబల్ ఆవిష్కర్తలుగా మారడానికి సహాయం చేయనున్నది. – సతీశ్ రెడ్డి, డాక్టర్ రెడ్డీస్ చైర్మన్
12.22 లక్షల కోట్లు రాబోయే ఆర్థిక సంవత్సరం
మూలధన వ్యయ లక్ష్యం 4.3% ద్రవ్యలోటు అంచనా
రూపాయి రాక
రూపాయి పోక