కోదాడ, మార్చి 30 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హేట్ స్పీచ్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు వాక్ స్వాతంత్ర్యానికి వ్యతిరేకమని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం కోదాడలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల, ప్రజలగొంతు నొక్కెందుకే ఈ బిల్లు ప్రవేశ పెడుతుందని విమర్శించారు. సదరు బిల్లులో స్పష్టత లేదని, ప్రజల భావ ప్రకటన స్వతంత్రాన్ని హరించేందుకు కుట్ర పన్నుతుందని దుయ్యబట్టారు. ప్రభుత్వ అవినీతిని, వైఫల్యాలను ఎండగట్టిన క్రమంలో హేట్ స్పీచ్ గా చిత్రీకరించే ప్రమాదం ఉందన్నారు.
ఇప్పటికే విద్వేషాలను అరికట్టేందుకు కేంద్ర చట్టాలు ఉన్నాయని, మరిన్ని కఠిన తరమైన అంశాలతో రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని తేవడం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను విమర్శించడం సహజమని, ఈ బిల్లులోని నిబంధనలు విమర్శ, విద్వేషం మధ్య ఉన్న గీతను చెరిపేస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బిల్లును వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.