– అర్హులైన విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలి
– ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్
రామగిరి, మార్చి 30 : నల్లగొండలోని మహాత్మ గాంధీ యూనిర్సిటీలో చదివే విద్యార్థులకు విద్యతో పాటు ఉపాది, ఉద్యోగ అవకాశాల కల్పనకే మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వీసీ ప్రొ.ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. సోమవారం ఎంజీయూలో వర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 4న నిర్వహించే ‘మెగా జాబ్ మేళా పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. జాబ్ మేళాను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వర్సిటీ ట్రైనింగ్ అండ్ ఫ్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డా.హరీశ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ జాబ్ మేళాలో ఐటీ, ఫార్మా, అగ్రికల్చర్, బ్యాంకింగ్ వంటి విభిన్న రంగాలకు చెందిన 15 ప్రముఖ కంపెనీలు హాజరవుతున్నట్లు, సుమారుగా ఆయా సంస్థలో 1,500 ఖాళీలు భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. ఎంజీయూలో ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభం అవుతుందని తెలిపారు.
యూనివర్సిటీ పరిదిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో యూజీ, పీజీ కోర్సులు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో పాటు ఇప్పటికే కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు హాజరుకావచ్చని వెల్లడించారు. పూర్తి వివరాలకు ఎంజీయూ ప్లేస్మెంట్ సెల్లో 7095922360, 9989260671, 9502771776, 9642676777, 9704810880 సంప్రదించాలని ఆయన వెల్లడించారు. పోస్టర్ ఆవిష్కరణలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ.కొప్పుల అంజిరెడ్డి, వివిధ విభాగాల అధికారులు ప్రొ.రేఖ, డా.శ్రీదేవి, డా.మిర్యాల రమేశ్ కుమార్, డా.నీలకంఠం శేఖర్ పాల్గొన్నారు.