India Pakistan Tension | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భద్రతా చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకొన్నది. దేశంలోని పోర్టులు, షిప్‌యార్డులు, టెర్మినళ్లలో భద్రతను పెంచింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. మరోవైపు, ఢిల్లీ సహా అన్ని విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లను అధికారులు మెరుగుపర్చారు. ఇందులో భాగంగా అన్ని విమానాలకు సెకండరీ లాడర్ పాయింట్ చెకింగ్‌ను బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) తప్పనిసరి చేసింది. ఇంకోవైపు, భారత సరిహద్దు నగరాల్లో పాకిస్థాన్ మరిన్ని దాడులకు పాల్పడే ప్రమాదమున్నదన్న ముందస్తు సమాచారంతో ఇప్పటికే రాజధాని ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన కేంద్రం.. ప్రజలను అలర్ట్ చేయడానికి సైరన్లను వినియోగించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఇందుకోసం 1968 సివిల్ డిఫెన్స్ చట్టంలోని నియమం-11ను వినియోగించుకోవాలని, సైరన్ వంటి అత్యవసర పరికరాలు కొనేందుకు అవసరమైన పూర్తి అధికారాలను ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇదిలాఉండగా.. ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
నిఘా నీడలో నౌకాశ్రయాలు, ఎయిర్‌పోర్టులు
దాయాది దేశం పాకిస్థాన్‌తో ఘర్షణ వాతావరణం నెలకొన్న క్రమంలో తీర ప్రాంతాల్లోని పోర్టులు, షిప్‌యార్డులు, నౌకలు, టెర్మినల్స్‌లో భద్రతను ఎంఏఆర్ఎస్ఈసీ లెవల్-1 (సాధారణ సెక్యూరిటీ) నుంచి ఎంఏఆర్ఎస్ఈసీ లెవల్-2కు (అదనపు సెక్యూరిటీ అండ్ పటిష్ట నిఘా) పెంచాలని చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్లకు (సీఐఎస్వో) కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ముంబైలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఒక ప్రకటనలో తెలిపింది. సైబర్ దాడులు జరిగే ప్రమాదం ఉన్న రీత్యా పోర్టుల్లో ఐటీ, కమ్యూనికేషన్ వ్యవస్థల భద్రతపై సమీక్షను నిర్వహించాలని సూచించింది. ‘తీర ప్రాంత భద్రత దృష్ట్యా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రకటన వెలువడిన వెంటనే అత్యంత ప్రాధాన్యతతో వీటిని అమలు చేయాలని సూచనలు వచ్చాయి. విధి నిర్వహణలో ఎవరైనా అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయి’ అని డిప్యూటీ నాటికల్ అడ్వైజర్, సీనియర్ డీడీజీ (టెక్) కెప్టెన్ నితిన్ ముకేశ్ తెలిపారు. మరోవైపు, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రతను పెంచారు. విమానాశ్రయ టెర్మినల్ భవనాల్లోకి సందర్శకుల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్టు బీసీఏఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని విమానాలకు సెకండరీ లాడర్ పాయింట్ చెకింగ్‌ను తప్పనిసరి చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా విమానాశ్రయాలు, వైమానిక స్థావరాలు, వైమానిక దళ స్టేషన్లు, హెలిప్యాడ్లు, ఏవియేషన్ శిక్షణ కేంద్రాలు, పౌర విమాన కేంద్రాల్లో భద్రతను పటిష్ఠం చేసింది.
అవసరమైతేనే అక్కడికి..
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ట్రావెల్ ఏజెన్సీ సంస్థ ఈజీమైట్రిప్ భారత్‌లోని తన వినియోగదారులకు కీలక సూచనలు చేసింది. తుర్కియే, అజర్బైజాన్ దేశాలు పాక్‌కు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆయా దేశాలకు అత్యవసరమైతేనే పర్యటించాలని సూచించింది. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
భద్రతను పెంచిన ప్రాంతాలివే..
పోర్టులు, షిప్‌యార్డులు, నౌకలు, టెర్మినల్స్, విమానాశ్రయాలు, వైమానిక స్థావరాలు, వైమానిక దళ స్టేషన్లు, హెలిప్యాడ్లు, ఏవియేషన్ శిక్షణ కేంద్రాలు, పౌర విమాన కేంద్రాలు, ఆయుధ కర్మాగారాలు, డిఫెన్స్ రిసెర్చ్ అండ్ టెస్టింగ్ సెంటర్లు, ఆర్థిక సంస్థలు, పరిపాలన భవనాలు, కట్టడాలు, న్యాయస్థానాలు, సీవరేజీ ప్లాంట్లు, ఆహార నిల్వ గోదాములు.
ఢిల్లీలో హై అలర్ట్
ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రభుత్వోద్యోగులకు సెలవులు రద్దు చేశారు. ఇండియా గేట్ సహా పలు కట్టడాలు, పరిపాలన భవనాలు, మార్కెట్లు, రైల్వేస్టేషన్లు, మాల్స్, పార్కులు, మెట్రోస్టేషన్లు వద్ద భద్రతను పెంచారు. ఇండియా గేట్ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని స్థానికులకు హెచ్చరికలు జారీ చేశారు. అడుగడుగునా తనిఖీలు ముమ్మరం చేశారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేలా వైద్య, విపత్తు నిర్వహణ విభాగాల సంసిద్ధతను సమీక్షిస్తున్నారు. అలాగే ఎటువంటి పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా ఢిల్లీలోని 11 రెవెన్యూ జిల్లాలను సంసిద్ధం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు వీలుగా గరిష్ఠంగా 16 కిలోమీటర్ల పరిధి వరకూ వినిపించే సైరన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ జిల్లాలో కనీసం 10 సైరన్లను ఏర్పాటు చేస్తున్నారు. బహూళ అంతస్తుల భవనాల మీద 40 నుంచి 50 సైరన్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఢిల్లీ పీడబ్ల్యూడీ మంత్రి పర్వేశ్ వర్మ శుక్రవారం తెలిపారు. సైరన్లు ఎలా పనిచేస్తున్నాయన్న దానిపై రిహార్సల్ పరీక్షలను ఇప్పటికే నిర్వహించినట్టు వెల్లడించారు. కాగా భద్రతా కారణాల రీత్యా ఢిల్లీ విమానాశ్రయం నుంచి శుక్రవారం 138 విమాన సర్వీసులు రద్దయినట్టు అధికారులు తెలిపారు.