Fact Check | విదేశాల నుంచి ఇంధన ఉత్పత్తులను తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం E20 పెట్రోల్‌ను ప్రోత్సహిస్తోంది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపి విక్రయించడం సైతం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే E20 పెట్రోల్‌పై రకరకాల ప్రచారం జరుగుతోంది. ఈ ఇంధనాన్ని వాడటం ద్వారా బైక్, కార్ల ఇంజిన్లు పాడవుతున్నాయంటూ మొదట్లో వార్తలు రాగా.. ఇప్పుడు E20 పెట్రోల్ పోసి వాహనానికి చీమలు పడుతున్నాయనే ప్రచారం తెరపైకి వచ్చింది. దీంతో భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) స్పందించింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.
పెట్రోల్‌లో కలుపుతున్న ఇథనాల్ చెరకు నుంచి తయారవుతుంది. కాబట్టి ఇథనాల్‌లో చక్కెర శాతం ఉంటుందని.. దాన్ని పెట్రోల్‌లో కలిసినప్పుడు ఆ తీపికి చీమలు ఆకర్షితులవుతున్నాయని ఒక ప్రచారం జరుగుతోంది. ఆ తీపి కోసమే వాహనాలకు చీమలు పడుతున్నాయని పుకార్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం, భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) స్పందించాయి. 20 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనం చీమలను ఆకర్షిస్తున్నాయనడానికి ఎలాంటి శాస్త్రీయపరమైన ఆధారాల్లేవని పేర్కొన్నాయి.
పెట్రోల్‌లో కలిపే ఫ్యూయల్ గ్రేడ్ ఇథనాల్ అనేది కిణ్వ ప్రక్రియ, స్వేదనం(డిస్టిలేషన్) వంటి దశల ద్వారా తయారవుతుందని బీపీసీఎల్ తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తయ్యే సమయానికి చక్కెర ఆనవాళ్లు కూడా మిగలవని పేర్కొంది. అందువల్ల చీమలను ఆకర్షించే తీపి పదార్థం ఇందులో ఉండదని వివరించింది. చక్కెరను తొలగించడమే కాకుండా.. ఇంధన వినియోగానికి అనుకూలంగా తయారుచేసే ఇథనాల్‌లో ప్రత్యేక రసాయనాలు (డీనేచ్యురెంట్లు) కలుపుతారని వెల్లడించింది. వీటి వాసనకు కీటకాలు, చీమలను దూరంగా ఉంచే లక్షణం ఉంటుందని తెలిపింది.
E20 పెట్రోల్‌లో ఇథనాల్ కలిపినప్పటికీ.. పెట్రోల్‌కు సహజంగా ఉండే హైడ్రోకార్బన్ల ఘాటు వాసనే అధికంగా ఉంటుందని బీపీసీఎల్ తలిపింది. ఈ పరిస్థితిలో చీమలు లేదా ఇతర కీటకాలు ఫ్యూయల్ క్యాప్ ప్రాంతానికి ఆకర్షితమయ్యే అవకాశమే లేదని స్పష్టం చేసింది. శాస్త్రీయ పరీక్షల ప్రకారం.. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ మిశ్రమం కలిసిన పెట్రోల్ నుంచి వెలువడే ఆవిరి పరిమాణం చాలా తక్కువగా ఉంటుందని తెలిపింది. దీంతో ఫ్యూయల్ ట్యాంక్ మూత వద్ద చీమలు చేరేందుకు అనుకూల పరిస్థితులు ఉండవని పేర్కొంది. కాబట్టి E20 ఇంధనం కారణంగా వాహనాల వద్ద చీమలు చేరతాయనే ప్రచారం పూర్తిగా అపోహ మాత్రమేనని.. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేసింది. సోషల్‌మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచించింది.