న్యూఢిల్లీ : రైతులకు పీఎం-కిసాన్ కింద అందించే రూ.6 వేల ఆర్థిక సాయంపై వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలోకి కొత్తగా చేరాలనుకునే లబ్ధిదారులు రైతు డిజిటల్ ఐడీలను తప్పనిసరిగా కలిగి ఉండాలని ప్రకటించింది. జనవరి 1 నుంచి దరఖాస్తు చేస్తున్న వారికి ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలిపింది. ఇందుకోసం భూరికార్డుల కంప్యూటరీకరణ చేయాలని, తప్పనిసరిగా సాగుదారుల పేర్లు రికార్డుల్లో ఉండేలా చూడాలని రాష్ర్టాలకు ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్ ఐడీలు లేకపోయినా ఇప్పటికే పీఎం-కిసాన్ అందుకుంటున్న పాత లబ్ధిదారులకు పథకం కొనసాగుతుంది. దేశంలోని రైతులందరికీ ‘కిసాన్ పెహ్చాన్ పత్ర’ పేరుతో కేంద్రం డిజిటల్ ఐడీలు ఇస్తున్నది. ఇందులో రైతుల పేర్లు, భూకమతానికి సంబంధించిన వివరాలు, పండించే పంటలు, ఇతర వ్యవసాయ సంక్షేమ పథకాల వివరాలు ఉంటాయి.