Census | జనాభా లెక్కలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ పేలవంగా ఉందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. జనాభా లెక్కల్లో కుల గణణ చేర్చడంలో కేంద్రం మౌనంగా ఉందని విమర్శించింది. ఇది ప్రభుత్వం మరో యూ-టర్న్ కాదా? అని ప్రశ్నించింది. కుల గణను మాత్రమే కాకుండా కులాల వారీగా సామాజిక-ఆర్థిక పారామితులపై వివరణాత్మక డేటా తెలిసేలా తెలంగాణ మోడల్‌ను అనుసరించాలని సూచించారు. 2026-27లో జరుగనున్న జనాభా లెక్కలకు సంబంధించి గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ తరహాలోనే ఉందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శించారు. జనాభా లెక్కల కోసం చాలా ప్రచారం చేసిన నోటిఫికేషన్‌ను చివరకు జారీ చేయశారని.. కానీ, ఇది కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుందని విమర్శించారు. 2025 ఏప్రిల్ 30న జారీ చేసిన నోటిఫికేషన్‌ను పునరుద్ఘాటించిందన్నారు. జాతీయ కాంగ్రెస్ డిమాండ్, ఒత్తిడి కారణంగా ప్రధానమంత్రి కుల గణన డిమాండ్‌కు తలొగ్గారని.. డిమాండ్ చేసిన కాంగ్రెస్ నేతలను అర్బన్ నక్సల్స్‌గా పిలిచారని విమర్శించారు. కేంద్రమే కుల గణన చేస్తామని ప్రకటించిందని.. తాజా నోటిఫికేషన్లో కుల గణన గురించి ప్రస్తావించలేదన్నారు.
జనాభా లెక్కల్లో తెలంగాణ నమూనాను స్వీకరించాలని జాతీయ కాంగ్రెస్ స్పష్టమైన అభిప్రాయంతో ఉందన్నారు. కుల గణణ మాత్రమే కాకుండా.. కులాల వారీగా సామాజిక, ఆర్థిక పరిస్థితికి సంబంధించి వివరణాత్మక సమాచారం సేకరించాలన్నారు. తెలంగాణలో జరిగిన కుల గణనలో 56 ప్రశ్నలు అడిగారని జైరాం రమేశ్ పేర్కొన్నారు. 56 అంగుళాల ఛాతీ ఉందని చెప్పుకునే వ్యక్తికి 16వ జనాభా లెక్కల్లో 56 ప్రశ్నలు అడిగేంత అవగాహన.. ధైర్యం ఉందా? అనేది ప్రశ్న అన్నారు. కేంద్రం ఈ రోజు జారీ చేసిన నోటిఫికేషన్లో కొత్తగా ఏముందని ప్రశ్నించారు. జమ్మూ కశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్‌లలో 2026 అక్టోబర్‌లో, భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో 2027 మార్చిలో జనాభా లెక్కలు జరుగుతాయని అందులో ఉందని.. జనాభా లెక్కల గురించి మాత్రమే ఉందని.. కులం గురించి ఎందుకు ప్రస్తావించలేదు.. దానిలో కులం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.. ఎన్ని ప్రశ్నలు ఉంటాయి.. అది కేవలం లెక్కింపు అవుతుందా? లేదంటే సామాజిక, ఆర్థిక పరిస్థితిపై ప్రశ్నలు ఉంటాయా? అన్నదానిపై ఏమీ సమాచారం లేదన్నారు. ముఖ్యాంశాల్లో నిలిచేందుకే నోటిఫికేషన్ జారీ చేశారని.. కుల గణనలో తెలంగాణ మోడల్‌ను జాతీయ స్థాయిలో అనుసరించాలని ఒత్తిడి తెస్తామన్నారు.