న్యూఢిల్లీ: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) నేడు విడుదల కానుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ (CEC Rajiv Kumar) మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించనున్నారు. తెలంగాణతో పాటు మిజోరం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల్లో పర్యటించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కసరత్తు పూర్తిచేసింది.
ఈ ఐదు రాష్ట్రాల్లో నవంబర్ మధ్య నుంచి డిసెంబర్ తొలివారంలోపు జరపవచ్చని ఈసీ వర్గాలు పేర్కొన్న విషయం తెలిసిందే. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్గఢ్లో రెండు విడుతల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా.. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఒకే దఫాలో నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది. కాగా, సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం ఇటీవల తెలంగాణలో మూడు రోజులపాటు పర్యటించిన విషయం తెలిసిందే. శాసనసభ ఎన్నికల సన్నాహకాలపై సమీక్ష నిర్వహించింది. ఈసందర్భంగా ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీచేశారు.