న్యూఢిల్లీ, జూలై 2 : అర్హులైన పౌరులు ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మంగళవారం కోరారు. అయితే వారు నివసిస్తున్న ప్రాంతంలోనే ఓటరుగా నమోదు కావాలి తప్ప వారికి సొంత ఇల్లు ఉన్న ప్రాంతం/ సొంత ఊరులో కాదని స్పష్టం చేశారు. కాగా, ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరిగే బీహార్లో ఓటర్ల లిస్టును ఎన్నికల సంఘం విస్తృతంగా సమీక్షిస్తున్న క్రమంలో ఆయన బూత్ స్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు.
కొందరు తెలిసో, తెలియకో తాము ఉంటున్న ప్రదేశంలో, సొంత ఊర్లలో కూడా ఓటర్లుగా నమోదు చేసుకుని ఉన్నారని చెప్పారు. ఉదాహరణకు పాట్నాకు చెందిన మీరు ఢిల్లీలో ఉంటూ ఉద్యోగమో, వ్యాపారమో చేసుకుంటున్నారనుకుంటే మీకు ఢిల్లీలో మాత్రమే ఓటు ఉండాలని, పాట్నాలో కాదని వివరించారు. ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారో అక్కడ మాత్రమే ఓటును కలిగి ఉండాలని, రెండు చోట్ల ఓటు కలిగి ఉండటం నేరమని ఆయన స్పష్టం చేశారు.