న్యూఢిల్లీ, ఏప్రిల్ 8 : కేవలం 10 గంటల వ్యవధిలో అమెరికా తన నిర్ణయం మార్చుకొని ఇరాన్‌తో కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ 10 గంటల్లో ఏం జరిగింది? రెండు వారాల కాల్పుల విరమణకు పాకిస్థాన్ పాత్రే కారణమని అమెరికా పేర్కొన్నప్పటికీ చివరి నిమిషంలో చైనా జోక్యమే ఈ ఒప్పందాన్ని ఖరారు చేసిందని తెలుస్తున్నది. ఇరాన్‌పై చర్చలకు ఒత్తిడి తేవడంలో చైనా ప్రమేయం ఉందా అని అడిగినపుడు అవుననే అంటున్నాను అని ట్రంప్ ఏఎఫ్‌పీతో అన్నారు. ట్రంప్ విధించిన గడువు సమీపించడం, పూర్తి స్థాయి యుద్ధం జరిగే ప్రమాదం పొంచి ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చైనా నేరుగా ఇరాన్‌తో చర్చలు జరిపినట్లు ఇద్దరు చైనా అధికారులను ఉటంకిస్తూ ఏపీ వార్తాసంస్థ తెలిపింది. దీన్ని బట్టి ఇరాన్‌పై పాకిస్థాన్ కన్నా చైనాకు ప్రత్యక్ష పట్టు ఉందని తెలుస్తున్నది. నిజానికి కాల్పుల విరమణ ఒప్పంద ప్రకటనకు కొన్ని గంటల ముందే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి బల ప్రయోగానికి అనుమతినిచ్చే ఒక తీర్మానాన్ని చైనా, ఇరాన్‌తో మరో మిత్రదేశమైన రష్యా కలసి అడ్డుకున్నాయి. యూఎన్ తీర్మానం ఇరాన్ పట్ల వివక్షతతో కూడుకుని ఉందని చైనా పేర్కొన్నది.
కాల్పుల విరమణలో తన పాత్ర గురించి చైనా ఇప్పటివరకు అధికారికంగా వ్యాఖ్యానించలేదు. చైనా ప్రభుత్వ ప్రతినిధి ఒకరు మాత్రం మంగళవారం మాట్లాడుతూ విదేశాంగ మంత్రి వాంగ్ యీ సోమవారం ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా, గల్ఫ్ దేశాలతో 26 సార్లు ఫోన్లో మాట్లాడారని చెప్పారు. పశ్చిమాసియాలోని చైనా ప్రత్యేక దూత కూడా ఈ దౌత్యంలో పాల్గొన్నట్లు ఆ అధికారి తెలిపారు. ట్రంప్ సృష్టించిన పశ్చిమాసియా గందరగోళంలోకి నేరుగా దిగకూడదనే చైనా విస్తృత వ్యూహానికి ఇది అనుగుణంగా ఉంది. కాగా చైనా మౌనం మాత్రం ప్రపంచ దృష్టిని తప్పించుకోలేకపోయింది. మీ శత్రువు తప్పు చేస్తున్నపుడు అతడికి ఎప్పుడూ అంతరాయం కలిగించవద్దు అనే శీర్షికతో వచ్చిన ది ఎకనమిస్టు మ్యాగజైన్ తాజా ముఖచిత్రం సారాంశం కూడా ఇదే. ఈ పరిణామం చోటుచేసుకున్న సమయం కూడా చాలా కీలకం. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశం కోసం ట్రంప్ వచ్చే నెలలో బీజింగ్ వెళ్లనున్నారు. చైనా పాత్రను ట్రంప్ ఒప్పుకున్నప్పటికీ ఆయన అధికారిక ప్రకటనలో మాత్రం దాని ప్రస్తావన లేదు.