న్యూఢిల్లీ : హొర్ముజ్ జలసంధిలో బుధవారం నౌకల రాకపోకలను ఇరాన్ మళ్లీ నిలిపివేసింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించిన పక్షంలో అమెరికాతో కాల్పుల విరమణ నుంచి వైదొలగుతామని కూడా ఇరాన్ హెచ్చరించింది. హొర్ముజ్ జలసంధిలో నౌకల ప్రయాణాన్ని ఇరాన్ అడ్డుకోవడంతో బుధవారం అనేక నౌకలు జలసంధిలో చిక్కుకుపోయాయని షిప్పింగ్ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. జలమార్గం ఇప్పటికీ మూతపడే ఉందని పేర్కొంటూ ఇరాన్ నేవీ నుంచి జలసంధిలో చిక్కుకున్న నౌకలకు నోటిఫికేషన్లు అందినట్లు వార్తాసంస్థ తెలిపింది. కాగా, ఇరాన్‌తో రెండు వారాల కాల్పుల విరమణను కుదుర్చుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను బలపరిచిన ఇజ్రాయెల్.. హెజ్బొల్లా పాత్ర కారణంగా కాల్పుల విరమణ షరతులు లెబనాన్‌కు వర్తించవని ఇదివరకు ప్రకటించింది.
వైట్ హౌస్ కూడా దీన్ని ధృవీకరించింది. లెబనాన్ ఈ ఒప్పందంలో భాగం కాదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కారొలిన్ లీవిట్ బుధవారం ఆక్సియోస్ వార్తాసంస్థకు తెలిపారు. అయితే ఇరాన్, అమెరికా మధ్య ఒప్పందం కోసం మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్‌కు బుధవారం ఫోన్ చేసిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇరాన్, లెబనాన్‌లో ఇజ్రాయెల్ పాల్పడిన కాల్పుల విరమణ ఉల్లంఘనలను చర్చించినట్లు తెలుస్తున్నది. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌తో ఫోన్లో మాట్లాడిన అరాగ్చీ ఇరాన్, లెబనాన్‌లో ఇజ్రాయెల్ పాల్పడుతున్న కాల్పుల విరమణ ఉల్లంఘనలను ప్రస్తావించారు.