న్యూఢిల్లీ : తొమ్మిది, పది తరగతులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్సీ) తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా పలు విమర్శలకు తావిస్తున్నది. తమిళనాడులో డీఎంకే నేత ఇలంగోవన్ మాట్లాడుతూ తమ రాష్ట్రం ప్రస్తుతం అమల్లో ఉన్న ద్విభాషా విధానాన్నే కొనసాగిస్తుందన్నారు. మరోవైపు విదేశీ భాషల ఎంపికలో ఆంక్షలు విధించడంతో పుదుచ్చేరిలోని పలు సీబీఎస్సీ పాఠశాలలు విద్యా ప్రణాళిక నుంచి ఫ్రెంచ్ భాషను తొలగించినట్లు సమాచారం.
విద్యావ్యవస్థలో ఇలాంటి విధానం అర్థం చేసుకోవడం చాలా కష్టమని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ వ్యాఖ్యానించారు. మరో కాంగ్రెస్ నేత సురేంద్ర రాజ్పుత్ మాట్లాడుతూ సరైన సంప్రదింపులు లేకుండానే కీలక విధాన నిర్ణయాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఏ కొత్త నిర్ణయాలైనా చర్చల ద్వారానే అమలు చేస్తారని, అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాస్వామ్యంలో చర్చలకు ముగింపు పలికారన్నారు.