న్యూఢిల్లీ: సీబీఎస్ఈ నిర్వహించే పదో తరగతి, పన్నెండో తరగతి బోర్డ్ పరీక్షలు సీసీటీవీ నిఘాలో జరగబోతున్నాయి. ఈ పరీక్షా కేంద్రాలన్నిటిలోనూ సీసీటీవీలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, 2025 వార్షిక బోర్డ్ పరీక్షల నుంచే సీసీటీవీ నిఘాలో పరీక్షలు జరపాలని సీబీఎస్ఈ ఆదేశించింది. పర్యవేక్షణను పటిష్టపరచడం, పరీక్షలను సజావుగా, స్వేచ్ఛగా నిర్వహించడం, అనుచిత పద్ధతులను నిరోధించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.
వచ్చే ఏడాదిలో దేశవ్యాప్తంగా, 26 ఇతర దేశాల్లో జరిగే బోర్డు పరీక్షలకు సుమారు 44 లక్షల మంది హాజరవుతారు. ఈ పరీక్షలకు సీసీటీవీ సదుపాయం లేని పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా పరిగణించబోమని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. సీసీటీవీ ఫుటేజ్ రహస్యంగా ఉంటుందని తెలిపింది.