న్యూఢిల్లీ: వచ్చే ఏడాది(2026)లో ప్రారంభం కానున్న 10వ తరగతి కోసం సవరించిన రెండు-పరీక్షల విధానం కింద రెండవ బోర్డు పరీక్షను రాసే విద్యార్థులకు కొన్ని స్పష్టమైన ఆంక్షలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) విధించింది. మొదటి పరీక్షలో మూడు లేదా అంతకు మించి సబ్జెక్టులలో గైర్హాజరైన లేదా ఉత్తీర్ణులు కాని విద్యార్థులను రెండవ పరీక్ష రాసేందుకు అనుమతించబోమని సీబీఎస్ఈ స్పష్టం చేసింది.
ఫిబ్రవరిలో జరిగే పరీక్షలో మూడు లేదా అంతకుమించి సబ్జెక్టులకు గైర్హాజరైన లేదా ఫెయిలైన విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ పరీక్షకు హాజరయ్యే అవకాశాన్ని కోల్పోతారని బోర్డు తెలిపింది. తమ సబ్జెకులను రెండు పరీక్షల కోసం విడగొట్టినా లేక మొదటి పరీక్ష రాయకుండా రెండవ పరీక్ష మాత్రమే రాయాలని ప్రయత్నించినా సాధ్యపడదని, అటువంటి విద్యార్థులను రెండవ పరీక్షకు హాజరుకానివ్వబోమని బోర్డు తెలిపింది.