న్యూఢిల్లీ : సీబీఎస్ఈ సెకండ్ బోర్డ్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న 10వ తరగతి విద్యార్థుల్లో నిరాశ పెరుగుతున్నది. ఆలస్యాన్ని ప్రశ్నిస్తూ, బోర్డు నుంచి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చాలామంది సోషల్ మీడియా బాట పట్టారు. మే 21తో పరీక్షలు ముగిసి దాదాపు 50 రోజులు గడుస్తున్నా సీబీఎస్ఈ ఇంకా ఫలితాల తేదీని ప్రకటించలేదు. దీనివల్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొన్నది.
ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లు ఇప్పటికే ప్రారంభం కావడంతో ఈ ఆందోళన మరింత ఎక్కువైంది. ‘ఎక్స్’ ప్లాట్ఫామ్లో విద్యార్థులు నిరంతరాయంగా ఫిర్యాదులు, మీమ్స్, అప్డేట్ ఇవ్వాలనే అభ్యర్థనలను పోస్ట్ చేస్తున్నారు. ఈ నిరీక్షణ తమ 11వ తరగతి అడ్మిషన్ల ప్రణాళికలపై ప్రభావం చూపుతున్నదని కొందరు పేర్కొంటున్నారు. ఈ చర్చ ఇప్పుడు భయాందోళనలు, హాస్యం కలగలిసినట్టుగా మారింది.
పదేపదే ఫలితాల కోసం వెతకడంపై కొందరు జోకులు పేలుస్తుంటే మరికొందరు బోర్డు తమను చాలాకాలంగా అనిశ్చితిలో ఉంచుతున్నదని ఆరోపిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, స్ట్రీమ్స్ మార్చుకోవాలనుకునే విద్యార్థులు ఆ ప్రక్రియను పూర్తి చేసుకోలేకపోతున్నారని అన్నారు.