న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పదో తరగతి రెండో బోర్డ్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. 2026 నుంచే పదో తరగతిలో రెండు బోర్డు పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన బోర్డు పరీక్ష ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 దాకా జరగ్గా.. రెండో బోర్డు పరీక్ష మే 15 నుంచి 21 దాకా నిర్వహించారు. 6,64,027 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా..6,63,777 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 5,13,955 మంది తమ మార్కులను మెరుగు పరుచుకోడానికి పరీక్ష రాశారు.
59.95 శాతం మంది అంటే 3,08, 095 మంది ప్రధాన పరీక్షతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించారు. కంపార్ట్మెంట్ విభాగం కింద మొత్తం 1,49,822 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా.. ఇందులో 78,503 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండు బోర్డు పరీక్షల ఫలితాలను కలపగా.. పదో తరగతిలో మొత్తం 96.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది.